‘రంగస్థలం’ సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు. క్లైమాక్స్ వల్ల సినిమా రేంజ్ పెరిగింది. గురువు సుకుమార్ అడుగు జాడల్లో వెళ్లిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ క్లైమాక్స్ ని కూడా గుర్తుండిపోయేలా తెరకెక్కించాడు. ఓరకంగా చెప్పాలంటే క్లైమాక్సే ఆ సినిమాకు ఆయువు పట్టు. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకొంటోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ‘నెవర్ బిఫోర్’ అనే రేంజ్లో రాసుకొన్నాడట బుచ్చిబాబు. ఈ క్లైమాక్స్ చాలా కాలం గుర్తుండిపోతుందని, మళ్లీ మళ్లీ ఈ క్లైమాక్సే థియేటర్లకు రప్పిస్తుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ ఇది. ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అందరికీ అర్థమయ్యే టైటిల్ కావాలి. అందుకోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. సుకుమార్ సినిమాల్లో హీరోకి ఏదో ఓ వీక్ నెస్ ఉంటుంది. ‘రంగస్థలం’లో చరణ్‌కు సరిగా వినపడదు. ఆ ప్లే.. కథకు బాగా ఉపయోగపడింది. ‘పెద్ది’లో కూడా హీరోకి ఓ లోపం ఉందని, దానితో నడిపించిన డ్రామా కథని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుందని చెబుతున్నారు. టెక్నికల్ గా ఈ సినిమాని చాలా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుతున్నారు. కొన్ని స్పెషల్ ఎప్పీరియన్స్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.