ఓటీటీలు కల్పతరువులు అనుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు ఓటీటీలే చిత్రసీమని శాశిస్తున్నాయి. ఓటీటీ సంస్థల చేతుల్లోనే సినిమా రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయంటే – పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవొచ్చు. ఇది వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల్ని నెత్తిన పెట్టుకొన్న ఓటీటీలు ఇప్పుడు వాటిని అధఃపాతాళానికి తొక్కడానికి చూస్తున్నాయి. ఆఖరికి పెద్ద సినిమాలపై కూడా ఓటీటీలు చిన్న చూపు చూస్తున్నాయి. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఒప్పుకొన్నారు కూడా. ”ఓటీటీల్ని నమ్ముకొని సినిమాలు తీసే రోజులు పోయాయి. సగం పెట్టుబడి ఓటీటీల నుంచే వచ్చేస్తుంది కదా అని ధైర్యంగా సినిమాలు తీసి, ఇప్పుడు చేతులు కాల్చుకొన్న వాళ్లు ఎంతోమంది. టాలీవుడ్ లో తయారైన రెండు మూడు పెద్ద సినిమాలు సైతం ఓటీటీ మార్కెట్ లేకపోవడంతో విడుదలకు నోచుకోలేకపోతున్నాయి” అంటూ ఓ బలమైన స్టేట్మెంట్ విసిరారు అరవింద్.
ప్రస్తుతం ఓటీటీల వైఖరికి అరవింద్ స్టేట్మెంట్ ఓ పెద్ద ఆనవాలు. ఓటీటీలు ఉన్నాయి కదా అని ఎడా పెడా సినిమాలు తీసేస్తున్న నిర్మాతలకు ఇదో హెచ్చరిక. ఓటీటీలు ప్రతీ సినిమానీ ఒకేలా చూస్తున్నాయి. కంటెంట్ బాగుందని అనిపిస్తేనే కొంటున్నాయి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది అనవసరం. ఇది వరకు ఓ పెద్ద హీరో సినిమా మొదలవుతుందంటే చాలు, ఓటీటీ డీల్ లాక్ చేసుకొని, అడ్వాన్సులు ఇచ్చేసేవి. ఇప్పుడు అదంతా గత చరిత్రే. సినిమా పూర్తయిన తరవాత టీజర్, ట్రైలర్, ఆ సినిమాకున్న బజ్ చూసి రేటు డిసైడ్ చేస్తున్నాయి. సినిమా చూసి, కొంటున్న దాఖలాలు ఎన్నో. కొన్ని బడా నిర్మాణ సంస్థలన్ని సైతం ఓటీటీలు లెక్క చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఓటీటీల దగ్గర కావల్సినంత కంటెంట్ వుంది. బడ్జెట్లు తక్కువైపోతున్నాయి. ఉన్న వనరుల్ని సరిగా వాడుకోవాలన్నది వాళ్ల ప్రయత్నం. రూ.50 కోట్లు పెట్టి పెద్ద సినిమాని కొనడం కంటే, అదే 50 కోట్లతో పది చిన్న సినిమాలు కొనొచ్చు. ఇదీ వాళ్ల ఐడియాలజీ. ‘విశ్వంభర’ లాంటి సినిమాకే ఓటీటీ డీల్ ఇంకా సెట్ అవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. భవిష్యత్తులో పెద్ద హీరోలు నటించే అన్ని సినిమాలకూ ఇదే పరిస్థితి ఎదురవ్వొచ్చు. కాబట్టి ఓటీటీల్ని నమ్ముకొని సినిమాలు తీసేవాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకొంటే బాగుంటుంది. అరవింద్ సలహా కూడా ఇదే.