జగన్ హయాంలో మద్యం అనేది ఓ పెద్ద లంబకోణం. కుంభకోణం చాలా చిన్నమాట. అంతా కళ్ల ఎదుట కనిపించిన దోపిడీనే. ఎన్నో పేద కుటుంబాల రక్త మాంసాలను పీల్చారు. అధికారం చేపట్టింది మొదలు.. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ పూర్తిగా వైసీపీ నేతలు, కార్యకర్తల కంట్రోల్లోకి వ్యవస్థను తీసుకెళ్లారు. అడ్డగోలుగా దోచుకున్నారు. అంతా నగదు లావాదేవీలే ఉండేలా చూసుకుని దోపిడీకి అడ్డం లేనట్లుగా వ్యవహరించారు. తాము వస్తే పెద్ద ఎత్తున దర్యాప్తు చేయించి స్కాము చేసిన వారందర్నీ లోపలేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. టీడీపీ నేతలు ఓ యుద్ధమే చేశారు.. బీజేపీ కూడా వేల కోట్ల స్కాం అని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో సీఐడీ విచారణ.. ఈడీకి రిఫర్ చేస్తామని ప్రకటించారు. కానీ దాదాపుగా ఎనిమిది నెలలు అవుతోంది.ఇప్పటికి సిట్ వేశారు.
మద్యం స్కాంలో సరఫరా దారులు ఎవరు.. ఎంత రేటుకు అమ్మారు.. ఎంత మద్యం అమ్మారు.. లెక్కల్లోని మద్యం ఎంత అమ్మారు.. ఎంత బ్లాక్ మనీ.. ఏ ఏ రూట్లలో తరలిపోయిందన్నది స్పష్టమైన లెక్కలు ఇప్పటికే సేకరించారు. గతంలో డిస్టిలరీల్లో సోదాలు నిర్వహించారు. వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని కీలక స్థానంలో కూర్చోబెట్టి అతనికి పావలానో పది పైసలో పడేసి మిగతా మొత్తం నొక్కేశారు. ఆ వ్యక్తి లావాదేవీల్లో చాలా వరకూ సాక్ష్యాలు దొరికాయి. నారా లోకేష్ నెక్ట్స్ మద్యం స్కాంపైనే చర్యలు ఉంటాయని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ అడుగు ముందుకు పడటం లేదు.
ఇప్పటికి సిట్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ లో ఉన్న వారంతా సిన్సియర్ ఆఫీసర్లే. వైసీపీ హయాంలో నిరాదరణకు గురైన వారే. అన్ని అంశాలపై వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ సిట్ నియామకం ఆలస్యం అయింది. ఇది ఏర్పాటు చేసినట్లుగా ఉండకుండా.. చర్యలు వెంటనే ప్రారంభించాల్సి ఉంది. మద్యం తయారీ కంపెనీలు ఎవరివో అందరికీ తెలుసు. అరబిందో శరత్ చంద్రారెడ్డి అంటే విజయసాయిరెడ్డి ఇందులో కీలక వ్యక్తి. మిథున్ రెడ్డికి డిస్టిలరీలు ఉన్నాయి. ఆయనే బ్లాక్ మనీ రూటింగ్ మాస్టర్ అని కూడా చెబుతున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అరెస్టులు చేసి.. సాక్ష్యాలతో సహా కోర్టుల ముందు ప్రవేశ పెట్టాల్సి ఉంది.
తప్పు చేసిన వాళ్లను వదిలి పెట్టేది లేదని డైలాగులు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి. కానీ గత ఎనిమిది నెలలుగా తిరుగులేని మెజార్టీ ఉన్న ప్రభుత్వం .. గతంలో జరిగిన తప్పులపై తీసుకున్న చర్యలు పది శాతం కూడా లేవు. కక్ష సాధింపులు అని ఊరుకుంటున్నారేమో కానీ.., ఇప్పటికే ప్రజల్లో అసహనం పెరుగుతోంది. తప్పు చేసిన వారిని శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ సిట్ అయినా దూకుడుగా పని చేస్తుందా ?