ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినా తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలం అన్న అనుభూతి కూడా రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మథనపడుతున్నారు. ఉన్న కొద్ది మంది ఎమ్మెల్సీలదీ అదే మాట. వీరందరికీ సర్ది చెప్పేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఇటీవల పది మంది ఎమ్మెల్యేలు విడిగా సమావేశమైన వైనం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసుల అంశం వంటి వాటిపై చర్చించి రేవంత్ అందరికీ భరోసా ఇవ్వనున్నారు. గురువారం జరగనున్న సమావేశంలో దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు.
ముందుగా సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. కుదిరితే రేవంత్ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మాత్రమే కాదు తాము రాజకీయంగా సర్వైవ్ కావాలంటే… తాము కూడా ఆర్థికంగా బలపడాలన్నది చాలా మంది మాట. ఈ ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో అత్యంధికం బడా కాంట్రాక్టర్ అయిన మంత్రి.. ఆయన కుటుంబసభ్యులకే దక్కుతున్నాయి. ఓ మాదిరి పనులు కూడా ఎమ్మెల్యేల వరకూ రావడం లేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు..క్యాడర్ కూడా పనులు వచ్చే బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వారికి ఈ భేటీలో హామీలు, భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కొంత మంది ఎమ్మెల్యేలకు పనులు కావడం ముఖ్యం. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కొన్ని పనులు పరిష్కారం చేస్తే వారు శాటిస్ ఫై అవుతారు. అలాంటి పనులకు సంబంధించి కూడా వారు తిరగాల్సి వస్తోంది. అలాంటి పనులను పరిష్కరించడానికి రేవంత్ ప్రత్యేక బృందాన్ని నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పాలన ఏడాది పూర్తి అయిన వెంటనే సొంత ఎమ్మెల్యేలు ఇలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి రావడం ప్రభుత్వాధినేతకు ఇబ్బందికరమే. అందుకే రేవంత్ కాస్త సీరియస్ గా ఈ ఇష్యూను సాల్వ్ చేయాలని అనుకుంటున్నారు.