భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉందని ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెట్టిన ఓ. పోల్లో డెబ్భై శాతం మంది తమకే అనుకూలంగా ఓటు వేశారని అంటే ప్రజల్లో తమకు ఎంత అనుకూలత ఉందో తెలుసుకోవచ్చని స్వయంగా కేసీఆర్ కూడా చెప్పారు. ఇలా కేసీఆర్ చెప్పిన గంటల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టుకుంది. ఓ గ్రాడ్యుయేట్, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినా సైలెంటుగా ఉంది. పోటీ చేయడం లేదని.. ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని పార్టీ నేతలకు సమాచారం పంపింది.
తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను కూడా వదిలి పెట్టకుండా పోటీ చేసేవారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను పక్కన పెడితే కనీసం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా పోటీ చేయడానికి బీఆర్ఎస్ ముందుకు రావడం లేదు. పైగా ఎన్నికలు జరుగుతుంది.. బీఆర్ఎస్ తమకు కంచుకోటలుగా చెప్పుకునే ఉత్తర తెలంగాణ జిల్లాలలో. మెదక్, నిజామాబాద్, కరీంనగర్ , ఆదిలాబాద్ నియోజవర్గాల్లో గ్రాడ్యూయేట్ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటారు.
ఈ పట్టభద్రులు సహజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ట్విట్టర్ పోల్స్ లో స్పష్టమవుతోందని ఆ పార్టీ వాదనను బట్టి అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఆ పార్టీ ఎందుకు వదిలేసుకుంటోంది ?. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఓట్లేస్తే వచ్చే ఒక్క విజయం ఆ పార్టీకి ఊపిరి పోస్తుంది . మరి ఎందుకు వదిలేసుకుంటున్నారు ?.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమకు కనీస ఓట్లు రావని తెలుసు కాబట్టే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ట్విట్టర్ పోల్స్ లో విద్యావంతులు ఓట్లు వేస్తే ఎందుకు భయపడతారన్న ప్రశ్నలు వస్తాయి. సోషల్ మీడియాను డబ్బుతో మ్యానిపులేట్ చేస్తున్నారన్న ఆరోపణలూ వస్తాయి. అయినా. బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల్లో పోటీకి రెడీగా లేదు.