ఆగస్ట్ చివరి నాటికి వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం నుంచే ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపి ఉద్యోగులలో 90-95 శాతం మంది అప్పటిలోగా విజయవాడకి తరలివచ్చేస్తారని చెప్పారు. పదవీ విరమణ దగ్గరపడిన వారు, కొన్ని ఇతర కారణాలతో విజయవాడకి తరలిరాలేనివారు హైదరాబాద్ లోనే ఉంటూ పనిచేస్తారని చెప్పారు. రాజధానిలో శాశ్విత భవనాలు నిర్మించబడేవరకు తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఆ తరువాత తాత్కాలిక సచివాలయం భవనాన్ని వేరే అవసరాలకి వినియోగించుకొంటామని చెప్పారు. హైదరాబాద్ నుంచి తరలివస్తున్న ఉద్యోగులు మొదట్లో కొన్ని ఇబ్బందులు పడవలసివచ్చినా సర్దుకుపోవాలని కోరారు.
ఉద్యోగులలో 5-10 శాతం మంది హైదరాబాద్ లోనే ఉండిపోయేందుకు ముఖ్యమంత్రి అనుమతించడం విశేషమే. మిగిలిన ఉద్యోగులు, ఫైళ్ళు, కార్యాలయాలు అన్నీ విజయవాడకి తరలించేసిన తరువాత హైదరాబాద్ లో ఉన్నవారు ఇంక చేయడానికి ఏమి పని ఉంటుంది? ఉన్నా సంబంధిత ఫైళ్ళు, అధికారులు అందుబాటులో లేనప్పుడు ఏవిధంగా పని చేయగలరు? అంటే హైదరాబాద్ లో ఉండిపోయే ఉద్యోగులు ఏ పని చేయకుండానే నెలనెలా జీతాలు, ఇంక్రిమెంట్లు అన్నీ తీసుకొబోతున్నారన్న మాట! వారు ప్రభుత్వోద్యోగులు గాబట్టి ఈవిధంగా అడగగలుగుతున్నారు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరిస్తోంది. అదే.. ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఈవిధంగా వ్యవహరించడానికి అవకాశం ఉండదు. అందుకు ఆ సంస్థల యాజమాన్యాలు కూడా అంగీకరించవు. కనుక ఇది సరైన నిర్ణయమేనా కాదా అని ప్రభుత్వం పునరాలోచించుకోవడం మంచిది.