తమిళంలో అజిత్ కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ తను స్టార్ హీరో. తన కథల ఎంపిక కూడా వైవిధ్యంగా ఉంటుంది. అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు చేస్తుంటాడు. వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. తన నుంచి ఇప్పుడు ‘పట్టుదల’ అనే సినిమా వచ్చింది. త్రిష కథానాయిక కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ ‘పట్టుదల’ ఎలా వుంది? అజిత్ చూపించే వైవిధ్యం ఈ కథలో ఉందా?
అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. పన్నెండేళ్ల వైవాహిక జీవితం తరవాత… అర్జున్ నుంచి విడిపోవాలని కాయల్ నిర్ణయించుకొంటుంది. ఆ నిర్ణయాన్ని అర్జున్ గౌరవిస్తాడు. కాయల్ విడాకులకు అప్లై చేస్తుంది. తన పుట్టింటికి వెళ్లిపోతానని అర్జున్‌ని అడుగుతుంది. `నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఇది మన లాస్ట్ ట్రిప్` అని అభ్యర్థిస్తాడు అర్జున్. ఇద్దరూ కలిసి రోడ్ మార్గంలో ప్రయాణం మొదలెడతారు. ఆ మధ్యలో ఓ అల్లరి మూక అర్జున్, కాయల్ లను బాగా ఇబ్బంది పెడుతుంది. మార్గ మధ్యలో కారు ఆగిపోతుంది. అటు వైపుగా వెళ్తున్న ఓ జంట (అర్జున్, రెజీనా) వీళ్లకు సహాయం చేస్తారు. కాయల్ని తమతో తీసుకెళ్తారు. అర్జున్ కారు దగ్గరే ఉండిపోతాడు. ఆ తరవాతి నుంచి కాయల్ మిస్ అవుతుంది. కాయల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? వాళ్ల ప్లాన్ ఏమిటి? అసలు ఈ ట్రాప్‌లో అర్జున్, కాయల్ ఎందుకు పడ్డారు? కాయల్ ని అర్జున్ తిరిగి దక్కించుకొన్నాడా, లేదా? అనేది మిగిలిన కథ.
తన భార్యని కాపాడుకోవడానికి ఓ భర్త చేసే సాసహ గాథ ఇది. హాలీవుడ్ లో ‘బ్రేక్ డౌన్’ అనే ఓ సినిమా వచ్చింది. దానికి ఇది రీమేక్. ఓ కడ్నాప్ డ్రామాని స్టైలీష్ యాక్షన్ హంగులతో తీద్దామనుకొన్నారు. ఆ ఆలోచన వరకూ ఓకే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథే పట్టుకొన్నాడు అజిత్. అర్జున్ – కాయల్ల ప్రేమకథ, ఆ ప్రేమ పెళ్లికి దారి తీయడం, విడాకుల ప్రపోజల్… ఇలాంటి సన్నివేశాలతో కథని మొదలెట్టాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో.. ఇదేదో లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే.. రోడ్ జర్నీ మొదలైందో అక్కడి నుంచి మూడ్ షిఫ్ట్ అవుతుంది. ఓ అల్లరి మూక హీరో, హీరోయిన్లని వెంబడించడం, కారు ఆగిపోవడం, అక్కడ్నుంచి కాయల్ మిస్సవ్వడం… ఈ సన్నివేశాలు చక చక సాగిపోతాయి. మెల్లగా కథ సస్పెన్స్ డ్రామా షేప్ తీసుకొంటుంది. ఇంట్రవెల్ ట్విస్ట్ కాస్త ఊహించిందే. కాకపోతే.. అప్పటి వరకూ తరవాత ఏం జరుగుతుందో అనే ఉత్సుకత రేకెత్తించాడు.
ఇంట్రవెల్ తరవాత కథ మరింత స్పీడు అందుకుంటుందని భావిస్తారంతా. కానీ.. అక్కడ నుంచి కథ మెల్లమెల్లగా డ్రాప్ అవుట్ అవుతూ వెళ్తుంది. విలన్ గ్యాంగ్ ఏం చెబితే అది చేసేస్తుంటాడు హీరో. వాళ్లు చెప్పిందల్లా నమ్మేస్తుంటాడు. హీరో ఎక్కడో ఓ చోట రివోల్ట్ అవ్వాలన్నది ప్రేక్షకుడి ఆశ. అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా అయినప్పుడు అది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ అజిత్ లోని హీరోయిజం ఎప్పుడో గానీ మేల్కోదు. అప్పటికే ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి నీరసం వచ్చేస్తుంది. ద్వితీయార్థం అంతా మైండ్ గేమ్ తో నడిపించాల్సింది. ఆ స్కోప్ ఈ కథలో ఉంది. తన భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు? అనేది హీరో చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే బాగుండేది. కానీ.. కిడ్నాప్ చేసిన వాళ్లే హీరో ఎదురుగా వచ్చి `మేమేరా నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేసింది` అనేంత వరకూ హీరోని ఆ విషయం తెలీదు. అన్నీ విలన్ గ్యాంగే స్పూన్ ఫీడింగ్ చేస్తుంటారు. దాంతో థ్రిల్ మిస్సయ్యింది. రెజీనా, అర్జున్‌లకు ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది. ఆయా సన్నివేశాలు కథకు అనవసరం. అసలు ఈ స్కెచ్ అంతా విలన్ గ్యాంగ్ ఎలా వేసిందో? ఈ ట్రాప్‌లో హీరో ఎలా పడ్డాడో? చూపించలేదు. కథకు అవసరమైన విషయాలు దాచేసి, అనవసరమైన సోదంతా సీన్లుగా రాసుకొంటూ వెళ్లడం పెద్ద మైనస్. సెకండాఫ్‌లో ఏదో బలమైన ట్విస్ట్ ఉంటుందేమో అనుకొంటారు. అది లేదు. దాంతో ద్వితీయార్థం మొత్తం చప్పగా సాగింది. సెకండాఫ్ పై దృష్టి పెట్టి ఉంటే మంచి సినిమాగా మిగిలేది.
అజర్ బయ్జాన్ లొకేషన్లు బాగున్నాయి. దాని వల్ల… సినిమాకు కొత్త కలర్ వచ్చింది. సినిమాలో సగం సీన్లు… అజిత్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు. అజిత్ మంచి రేసర్. `ఈ సినిమాలో మీరు కార్ డ్రైవ్ చేస్తే చాలు..` అని దర్శకుడు చెప్పి ఉంటాడు. ఆ మోజుతో అజిత్ ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడు. ఎందుకంటే.. అజిత్ లాంటి స్టార్ చేయదగిన సినిమా అయితే కాదు. మరెందుకు ఒప్పుకొన్నాడో ఏమిటో?యాక్షన్ సీన్స్ లో ఎప్పటిలా పర్ఫెక్ట్ గా చేశాడు అజిత్. తన ఫ్యాన్స్‌కు నచ్చే మూమెంట్స్ ఈ సినిమాలో కనిపించవు. త్రిష అతిథి పాత్రకు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ. సినిమా మొదలైన 15 నిమిషాల వరకే త్రిష స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ తరవాత చివర్లో మెరుస్తుంది. రెజీనాకు ఎక్కువ స్కోప్ ఉంది. తనకు కొత్త తరహా పాత్ర. అర్జున్‌ని కూడా సరిగా వాడుకోలేదు.
అనిరుధ్ నేపథ్య సంగీతంలోనూ మెరుపుల్లేవు. ఓ మెలోడీ పాటని బాగా ట్యూన్ చేశాడు. అందులో పదాలు అర్థవంతంగా ఉన్నాయి. ఫైట్స్ సహజంగా చిత్రీకరించారు. కార్లో తీసిన ఫైట్ బాగుంది. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాలి. ఓ సీన్లో ‘సారీ` అంటుంది త్రిష. అది విని రెజీనా ‘మీరు తెలుగువారా’ అని అడుగుతుంది. `సారీ` తెలుగు పదమా? ఇంత వరకూ మాకు తెలీదే.. అంటూ ప్రేక్షకులు ఫీలవ్వాల్సిన పరిస్థితి. చాలా తెలుగు పదాలు కృత్రిమంగా అనిపిస్తాయి. వాటిని హరిహరించాలి. నిర్మాణ పరంగానూ భారీదనం ఏం కనిపించలేదు. అజర్ బయ్జాన్ పర్యాటక రంగ అభివృద్ధి కోసం తీసిన సినిమాలా అనిపిస్తుంది. బహుశా… అక్కడి ప్రభుత్వం తమ దేశంలో తీసే సినిమాలకు భారీ రాయితీలేమైనా ఇస్తుందేమో మరి.