ఎందుకో.. అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్ కి దొరికిపోతున్నాడు. మొన్నటికి మొన్న ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజుని ఎలివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అంటూ.. పరోక్షంగా వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు. ఇప్పుడు `చిరుత సరిగా ఆడలేదు.. బిలో యావరేజ్` అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేసి మళ్లీ మెగా ఫ్యాన్స్ కి దొరికిపోయాడు. చరణ్ తొలి సినిమా చిరుత సరిగా ఆడలేదని, అలాంటి పొజీషన్లో ‘మగధీర’ తీసి హిట్టు ఇచ్చానని, అది చరణ్ పై తనకున్న ప్రేమని అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అయితే చిరుత బిలో యావరేజ్ సినిమా ఏం కాదు. అది హిట్. మంచి వసూళ్లని అందుకొంది. నిర్మాతకు లాభాలు మిగిల్చింది. రూ.9 కోట్లతో తీసిన సినిమా అది. బాక్సాఫీసు దగ్గర రూ.25 కోట్ల వరకూ వసూలు చేసింది. 40 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఓ డెబ్యూ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం అప్పట్లో ఓ రికార్డ్. ఇలాంటి సినిమాని సరిగా ఆడలేదంటూ అరవింద్ చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అనడంలోనైనా ఓ అర్ధం ఉంది. ఆ సినిమా పెట్టుబడికీ, రాబడికీ చాలా వ్యత్యాసం ఉంది. మెగా ఫ్యాన్స్ కే ఆ సినిమా నచ్చలేదు. మరి.. ‘చిరుత’ని ఫ్లాప్ అనడం ఏమిటి? ‘మగధీర’ లాంటి హిట్.. చిరుతకు రాలేదు. కాకపోతే.. అంకెల పరంగా చూస్తే ‘చిరుత’ హిట్ కిందే లెక్క. ఈ విషయం ఇంత అనుభవం ఉన్న నిర్మాతకు తెలియకపోవడం ఏమిటి?
అరవింద్ ఇదంతా కావాలని చేస్తున్నారా, లేదంటే యధాలాపంగానే జరుగుతోందా? అనేది అర్థం కావడం లేదు. మెగా ఫ్యాన్స్ కీ, అల్లు అర్జున్ ఆర్మీకీ మధ్య ఎడబాటు పెరుగుతున్న వేళ, ఇలాంటి కామెంట్లు మరింత చిచ్చు పెడతాయి. ఈ విషయం అరవింద్ ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది.