విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తున్న సినిమా లైలా. టీజర్ లో లైలా గెటప్ బాగానే టీజ్ చేసింది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. అసలు విశ్వక్ లైలా అవతారం ఎత్తడానికి కారణం ఏమిటో ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.
సోను మోస్ట్ వాంటెడ్. అతని కోసం పోలీసులు, గ్యాంగ్ స్టార్లు గాలిస్తుంటారు. కట్ చేస్తే.. లైలా అవతారం తెరపైకి వచ్చి ఇక అందరినీ కవ్విస్తుంది. సింపుల్ గా ట్రైలర్ పాయింట్ ఇదే. అయితే ట్రైలర్ మొత్తం మోటు సరసం, డబల్ మీనింగ్ డైలాగులు, మోతాదు మించిన రొమాంటిక్ సీన్స్ తో నిండిపోయింది.
బేసిక్ గా ఓ అబ్బాయి అమ్మాయి అవతారం ఎత్తగానే తనవైపు అదోరకంగా చూస్తే పురుష పాత్రలని డిజైన్ చేయడం ఓ రొటీన్ వ్యవహారం. ఇందులో కూడా లైలా అంటే పడిచచ్చిపోయే కొన్ని క్యారెక్టర్ లు కనిపించాయి. లైలా పలికిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా మొరటుగా అనిపించాయి.
సోను, లైలా రెండు పాత్రల్లో రాణించే ప్రయత్నం చేశాడు విశ్వక్. అతని లేడి గెటప్ కాస్త దిట్టంగానే వుంది. దాన్ని జస్టిఫికేషన్ చేసినట్లు ‘లేడి గెటప్ వేసిన విశ్వక్ సేన్ లా వున్నావ్’ అనే డైలాగ్ కూడా వినిపించారు. లైలా చుట్టూనే ఈ సినిమా డ్రామా అంతా వుంది. ఆ ట్రాక్ పండితే సినిమా పాసైపోయినట్లే. ఈ నెల 14న సినిమా వస్తోంది.