కేటీఆర్ హఠాత్తుగా పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. యూజీసీ బిల్లు గురించి అభ్యంతరం తెలిపామన్నారు. కొన్ని అభివృద్ధి పనుల కోసం వచ్చామన్నారు. అలాగే ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు విషయంలో లాయర్లతో మాట్లాడతామన్నారు. ఇవన్నీ రొటీన్ అంశాలు.. ఇందు కోసం ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదనేది రాజకీయవర్గాల భావన.
మరి కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారు.. బీజేపీ పెద్దలతో ఎందుకు సంప్రదింపులు జరిపారన్నది సస్పెన్స్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించిందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ పెట్టకుండా పరోక్షంగా బీజేపీకే సహకరిస్తున్నామన్న సందేశాన్ని కేటీఆర్ డిల్లీ బీజేపీ పెద్దలకు చేరవేయడానికే వెళ్లారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక గ్రాడ్యూయేట్, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు.
బీఆర్ఎస్ బలంగా ఉందని కేటీఆర్ గట్టిగా చెబుతున్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. పట్టభద్రులు ఉద్యమకారులు. వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకులంా ఉంటారన్న అభిప్రాయం ఉంది. అందుకే పోటీ చేయడానికి చాలా మంది ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా ప్రయత్నించారు. ఆసక్తి చూపించారు. అయినా కేసీఆర్ మాత్రం పోటీగా దూరంగా ఉన్నారు. బీజేపీ కోసమేనని ఇప్పటికే జరుగుతున్న ప్రచారానికి కేటీఆర్ ఢిల్లీ టూర్ మరింత ఆజ్యం పోసింది.