స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే వరకూ రానివ్వకుండా ఏకగ్రీవాలు చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సీఎల్పీ మీటింగ్ లో అదే సందేశం ఇచ్చారు. ఇక నుంచి గ్రామాలకు వెళ్లి వాళ్లకు కావాల్సిన పనులు చేసి పెట్టాలన్నారు. రోడ్లు కావాలంటే రోడ్లు.. పథకాలుకావాలంటే పథకాలు మంజూరు చేస్తూ.. స్థానిక ఎన్నికలకు ప్రిపేర్ కావాలన్నారు. గ్రామాల్లో చేయాల్సిన పనులకు సంబంధించి నిధులు కావాలంటే సంబంధిత మంత్రిని కలవాలని సలహా ఇచ్చారు.
సీఎల్పీ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలతో రేవంత్ విడివిడిగా మాట్లాడారు. అందరికీ ఆర్థిక పరంగా ఇబ్బందుల్లేకుండా పనులు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మీ మీ నియోజకవర్గాల్లో అత్యధికం ఎలా ఎకగ్రీవం చేసుకోవాలో సలహాలు ఇచ్చారు. వచ్చే రెండు వారాల్లో మొదటగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిరవహించనున్నారు. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీలు ఏకగ్రీవం అవడం కష్టమే అయినా ప్రయత్నించాలని.. పంచాయతీలు అయితే సగం అయినా ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ గెల్చినట్లుగా స్పీప్ చేయకపోతే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే చిన్న నిర్లక్ష్యం కూడా వద్దని చెబుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలకు కాస్త గట్టిగానే రేవంత్ క్లాస్ తీసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉంటున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తానని స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో మైనస్లు కనిపిస్తే ఊరుకునేది లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.