విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదని అందుకే ఆయన పార్టీని వీడిపోయారని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ఆర్థికంగా ఊహించలేనంత బలంగా ఉన్నా.. రాజకీయంగా ఓ సారి ముఖ్యమంత్రి అయ్యారన్నా దానికి కారణం విజయసాయిరెడ్డి. 2014-19 మధ్య కాలంలో విజయసాయిరెడ్డి ఏం చేశారో వైసీపీ నేతలకు తెలుసు. పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన పడిన కష్టమే అని ఎక్కువమంది నమ్ముతారు. ఎవరో ఎందుకు జగన్ కూడా నమ్ముతారు. అందుకే ఫలితాలు వచ్చిన రోజున మొదట ఆయననే హగ్ చేసుకుని ఆ ఫోటో రిలీజ్ చేసుకున్నారు.
అలాంటి విజయసాయిరెడ్డి ఇవాళ జగన్ కు ఎందుకు క్యారెక్టర్ లేని వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఓ గౌరవనీయ వృత్తిలోఉండి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని పదహారు నెలలు జైల్లో ఉన్నారు. జగన్ మానసిక వికృత రోగాన్ని సంతృప్తి పరచడానికి ఆయన ఘోరమైన భాషతో రాజకీయం చేశారు.చివరికి షర్మిల కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడారు. అంతా జగన్ కోసమే చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన క్యారెక్టర్ లేని పెద్ద మనిషి అయ్యారు ?
జగన్ రెడ్డికి పరిస్థితి అర్థం కావడం లేదు. ఆయన సొంత తల్లి, చెల్లి కూడా దూరమయ్యారంటే.. ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉందో అందరికీ అర్థమవుతుంది.అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం, అప్పటికీ రాసిచ్చిన ఆస్తుల కోసం తల్లి, చెల్లి మీద కోర్టుకెళ్లారంటే ఎలాంటి క్యారెక్టర్?. చెల్లికి రాసిచ్చేసిన బెంగుళూరు ప్యాలెస్ నే ఇప్పుడు ఆక్రమించుకోవడం ఎలాంటి క్యారెక్టర్ ?. జగన్ కోసం విజయసాయిరెడ్డి తన ఒరిజినల్ క్యారెక్టర్ ను కించ పరచుకున్నారు. ఇప్పుడు జగనే ఆయన క్యారెక్టర్ లెస్ అని సర్టిపికెట్ ఇస్తున్నారు.