జనసేన పార్టీకి గుర్తింపునిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం కూడా నిర్ణయం తీసుకుంది. ఏపీలో గుర్తింపు పొందిన పార్టీగా ఉన్న జనసేన పార్టీ.. ఇక్కడ కూడా తమను గుర్తించాలని.. స్థానిక ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ తరపున నిలబడే అభ్యర్థులకు మాత్రమే గాజుగ్లాస్ గుర్తును కేటాయిస్తారు. పంచాయతీలు మినహా మిగతా ఎన్నికలు పార్టీల గుర్తుల ద్వారా జరుగుతాయి. ప్రాదేశిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు కీలకం
జనసేన పార్టీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఇప్పటికే ప్రకటించారు. అయితే జనసేన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉంది. అయితే ప్రధానంగా ఏపీ వరకూ వారి పొత్తులు ఉన్నాయి. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవని కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ క్యాడర్ కు అవకాశాలు కల్పించాలని పవన్ కల్యాణ్ కూడా అనుకుంటున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్దగా అవకాశాలు కల్పించలేదు. ఎన్నికలు. జరిగినప్పుడల్లా ఏదో ఓ కారణంతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఈ సారి మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గుర్తు కూడా రిజర్వ్ కావడంతో తెలంగాణ జనసేన వర్గాలు మరింత ఉత్సాహంగా ఉన్నాయి.