ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్ష నేత సి. రామచంద్రయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వమే అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మించి ఇస్తానని చెప్పినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించడంలేదు? అని ప్రశ్నించారు. మళ్ళీ ఆయనే దానికి జవాబు కూడా చెప్పారు. కమీషన్ల కోసం ఆశపడి కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆ ఆఫర్ ని పట్టించుకోకుండా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిర్ణయం వలన ఆయనకి కమీషన్లు, తెదేపా నేతలకి వారి అనుచరులకి రాజధాని నిర్మాణం పనుల కాంట్రాక్టులు లభిస్తాయనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి విదేశీ కంపెనీలకే మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు.
తద్వారా ఆయన రాష్ట్ర ప్రజల జీవితాలని, వారి భవిష్యత్ ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదని విమర్శించారు.
స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం రాజధానిని నిర్మించి ఇవ్వవలసిన పూర్తి బాధ్యత సదరు సంస్థదే అవుతుంది. అందుకు అవసరమైన నిధులని అదే సమకూర్చుకోవలసి ఉంటుంది. అందుకు బదులుగా రాజధానిలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సదరు సంస్థకి భూమిని కేటాయించవలసి ఉంటుంది. ఆ సంస్థ ఏమేమి నిర్మాణపనులు చేస్తుంది? ఏమేమి భవనాలు నిర్మించి ఇస్తుంది? ప్రతిగా ప్రభుత్వం ఆ సంస్థకి ఏమి ఇవ్వాలి? అనేవి ఒప్పంద పత్రంలో పేర్కొనబడతాయి. కానీ ఆ వివరాలేవీ ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు.
వైకాపా చెపుతున్న దాని ప్రకారం సింగపూర్ సంస్థలతో ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిపోయాయి. కేవలం ప్రజలని, ప్రతిపక్షాలని మభ్యపెట్టేందుకే గ్లోబల్ టెండర్లు పిలుస్తామని ప్రభుత్వం చెపుతోందని ఆరోపిస్తోంది. అసలు స్విస్ ఛాలెంజ్ విధానమే మనకి సరిపడదని, దాని వలన రాష్ట్రం సింగపూర్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుందని ఆరోపిస్తోంది. సింగపూర్ సంస్థలు కేవలం రూ.300 కోట్లే పెట్టుబడులు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని వాదిస్తోంది. దానితో రాష్ట్ర ప్రభుత్వమే అన్ని మౌలికవసతులు కల్పిస్తే, అక్కడ సింగపూర్ సంస్థలు కొద్దిగా పెట్టుబడి పెడితే వాటికి ప్రభుత్వం ఎందుకు ప్రయోజనం చేకూర్చాలని ప్రయత్నిస్తోందని వైకాపా ప్రశ్నిస్తోంది. ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించడం ఎందుకు, కృష్ణానదికి వరదలు వస్తే రాజధాని నగరాన్ని ముంచేస్తాయనే భయంతో కృష్ణా కరకట్టల ఎత్తుని పెంచడం ఎందుకు? దాని కోసం మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అని వైకాపా ప్రశ్నిస్తోంది.
వైకాపా అడుగుతున్న ఈ ప్రశ్నలకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జవాబు చెప్పడం లేదు కానీ అలాగ ప్రశ్నిస్తునందుకు అది రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతోందని ఎదురుదాడి చేస్తోంది. అమరావతి ప్రజారాజధాని అని చెపుతున్న ప్రభుత్వం, ఈ మొత్తం వ్యవహారంలో చాలా గోప్యత పాటిస్తున్నందునే ఇటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్దతిని రాష్ట్రంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా అది ముందుకే సాగుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తే అప్పుడు అది మరొక సమస్యకి దారి తీసే ప్రమాదం ఉంటుంది. కనుక దీనిపై అడుగు ముందుకి వేసే ముందు ప్రభుత్వం పునరాలోచన చేయడం చాలా మంచిది.