రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తూంటాయి. హైదరాబాద్లో సీఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో పార్టీ హైకండ్ పెద్దలతో చర్చలు జరుపుతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం రానున్నాయి. అదే సమయానికి ఆయన ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కోలుకున్నదేమీ లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ విజయం సాధిస్తే మాత్రం ఆ పార్టీకి మరింత ఊపు వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
మంత్రివర్గ విస్తరణకు అనుమతి కోసం రేవంత్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు నెలల కిందటే జాబితా కూడా సమర్పించారు. కుల సమీకరణాలు.. జిల్లా సమీకరణాలు చూసుకుని ఆయన జాబితా సమర్పించారు. అయితే ఇతర నేతలు.. చివరికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఓ జాబితా సమర్పించారని చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు. ఇలా చేయడం వల్ల ఆశావహులు మాత్రం నిరంతరం పెరుగుతున్నారు. అది చివరికి అసంతృప్తిగా మారుతోంది.
తన అన్న పదవి ఊడగొట్టి అయినా తనకు పదవి ఇవ్వాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఆయన గతంలో ఎలా వ్యవహరించేవారో ఇప్పుడు కూడా అలా వ్యవహరిస్తున్నారు. పదవి ఇస్తే సరి లేకపోతే కాంగ్రెస్ సర్కార్ సంగతి చూస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుమతి తెచ్చుకున్నా.. ఎవరెవరికి పదవులు ఇవ్వాలి.. పదవులు ఇచ్చిన తర్వాత.. అసంతృప్తి నేతల్ని ఎలా నియంత్రించాలన్నది పెద్ద సమస్యగా మారనుంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై పెద్దగా ఆసక్తి చూపకుండా.. అలా నెట్టుకొస్తున్నారు.