గజ్వేల్లో కులగణన విజయవంతం అయినందుకు బహిరంగసభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ తమ ఘన విషయాలుగా రేవంత్ భావిస్తున్నారు. ఆ రెండింటిని సెలబ్రేట్ చేసేందుకు రెండు భారీ బహిరంగసభలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఒకటి గజ్వేల్ లో ..రెండోది సూర్యాపేటలోఅనుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగాఉంటూ బయటకు రాని కేసీఆర్ నియోజకవర్గంలో భారీ సభ పెట్టి బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టాలనుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెలలో ప్రకటించి వెంటనే నిర్వహించాలనుకుంటున్నారు. దానికి కూడా ఈ సభలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. గజ్వేల్ సభకు కాంగ్రెస్ అగ్రనేతల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అగ్రనేతలు పాల్గొనలేదు. పాల్గొనాలని ఈ సారి గట్టిగా రేవంత్ రెడ్డి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గజ్వేల్ లో సభ పెడితే పోటీగా బీఆర్ఎస్ కూడా అంత కంటే భారీ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల తనను కలిసిన కార్యకర్తలతో కేసీఆర్ ఫిబ్రవరిలో భారీగా బహిరంగసభ పెట్టుకుందామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఎక్కడ నిర్వహించాలన్నది ప్లాన్ చేయలేదు. కేసీఆర్ అలాంటి ప్రకటన చేస్తారు కానీ.. తర్వాత ఫాలో అప్ ఉండదు. కానీ స్థానిక ఎన్నికల కోసం ఆయన ప్రచారం చేయలేరు కానీ.. ఓ బహిరంగసభ అయినా పెడితే బాగుండని నేతలు అనుకుంటున్నారు. అది గజ్వేల్ లోనే పెట్టే చాన్స్ ఉంది. గజ్వేల్, సిద్దిపేటల నుంచి భారీగా జన సమకీరణతో పట్టు తగ్గలేదని నిరూపించుకోవచ్చని భావిస్తున్నారు.