ఏ 1 జగన్ రెడ్డిపై ఏ 2 విజయసాయిరెడ్డికి కోపం వచ్చింది. తనను విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ లేని వ్యక్తి అని జగన్ పేర్కొనడంపై విజయసాయిరెడ్డి ఫీల్ అయ్యారు. నేరుగా జగన్ పేరును ప్రస్తావించడానికి సిగ్గుపడ్డారో.. భయపడ్డారో కానీ ఓ ట్వీట్ పెట్టారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని అన్నారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డి చెప్పిన ఈ రెండుమాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా లొంగలేదని ఎందుకు అన్నారంటే.. ఆయన కేసుల్లో అప్రూవర్ కాలేదని గుర్తు చేసుకోవాలని విజయసాయిరెడ్డి పరోక్షంగా చెప్పారు. నిజంగా ప్రలోభాలకు లొంగేవాడినే అయితే ఈ పాటికి జగన్ ను జైలుకు పంపేసి తాను సేఫ్ సైడ్ గా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పదవుల్ని వదిలేశాను కాబట్టి తనకు భయం లేదని.. పార్టీ ని కూడా అందుకే వదిలేశారని చెప్పుకొచ్చారు. అంటే జగన్ గురించి కూడా తాను భయపడలేదని చెప్పుకొచ్చారని అనుకోవచ్చు.
జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కలవలేదు. జగన్ కలవాలనుకోలేదో.. విజయసాయిరెడ్డి కలవలేదో స్పష్టత లేదు. కానీ ఇద్దరి మధ్య టర్మ్స్ అంత గొప్పగా లేవని మాత్రం స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్లినంత మాత్రాన.. ఆయనపై ఘోరమైన నిందలు వేయడం.. క్యారెక్టర్ సరిగ్గా లేదని చెప్పడం వైసీపీ నేతల్నీ షాక్ కు గురి చేసింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇది పెరిగితే విజయసాయిరెడ్డి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారేమో ?