సోషల్ మీడియా పోస్టుల కేసులో ఆర్జీవీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన దేనికీ సరైన సమాధానం చెప్పలేదు. ట్విట్టర్ ఖాతా తనదే కానీ ఎవరు పోస్టులు పెట్టారో తెలియదని డొంక తిరుగుడు సమాధానం చెప్పి… నా కంటే తెలివైన వారు ఎవరూ లేరన్నట్లుగా పోలీసుల వైపు చూశారు. ఆ పాయింట్ ఆధారంగానే పోలీసులు ఆర్జీవీని పట్టేసుకున్నారు. ఫోన్ స్వాధీనం చేయాలని ఆదేశించారు. అయితే ఆర్జీవీ తన ఫోన్ ను వైసీపీ నేతలకు ఇచ్చి వచ్చారు. వారు దాన్ని కనిపించకుండా చేశారు. తాను కారులో పెట్టి వచ్చానని.. ఆ కారు హైదరాబాద్కు పోయిందని.. చాలా మాటలు మార్చారు. ఈ సారి నోటీసులు ఇచ్చినప్పుడు ఫోన్ తో సహా రావాలని పోలీసులు తేల్చి చెప్పారు.
ఆర్జీవీపై ఈ ఒక్క కేసు కాదు. బోలెడన్ని కేసులు ఉన్నాయి. మరో కేసులో సీఐడీ పోలీసులు పదో తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసులో అరెస్టు చేయకూడదని ఆదేశాలు లేవు. కానీ ఏపీ పోలీసులు అంత తేలికగా అరెస్టు చేయరు. అంతకు మించిన నరకం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. సాదాసీదా కేసుల్లో కాకుండా.. అసలు మొత్తం వైసీపీ సోషల్మీడియా నెట్ వర్క్ ను చేదించేందుకు పోలీసులు స్కెచ్ వేస్తున్నారు. రూ. రెండు కోట్లు ఫైబర్ నెట్ డబ్బులు తీసుకున్న అంశంపైనా ప్రశ్నలు వచ్చాయంటే .. పోలీసులు పక్కగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
ఆర్జీవీ డబ్బుల కోసం ఆశ పడ్డారో.. తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకోవాలనుకున్నారో కానీ కూటమి నేతలపై ఘోరమైన దాడి చేశారు. దానికి ప్రతిఫలంగా వైసీపీ నుంచి డబ్బు అందుకున్నారు. తన ట్విట్టర్ ఖాతాను వైసీపీ సోషల్ మీడియాకు అద్దెకు ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఆర్జీవీ తాను ఇక పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెడతానని.. సిండికేట్ అనే సినిమా తీస్తానని ఇటీవల ప్రకటించారు. కానీ పోలీసు కేసులు ఆయనను సినిమాపై దృష్టిపెట్టేలా లేవు. ఆర్జీవీకి మెంటల్ టార్చర్ ఖాయమనిఅంచనా వేస్తున్నారు.