మహేష్ బాబు – రాజమౌళి సినిమా గప్ చుప్‌గా షూటింగ్ మొదలైపోయింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని 5 రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో తీర్చిదిద్దారు. తదపరి షెడ్యూల్ కూడా త్వరలోనే మొదలైపోనుంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో నానా పటేకర్ కనిపించబోతున్నారని టాక్. ఆయనపై కూడా లుక్ టెస్ట్ నిర్వహించారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహేష్ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకొంటారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నానా పటేకర్ ని తీసుకొంది మహేష్ తండ్రి పాత్ర కోసమా? కాదా? అనేది తేలాల్సివుంది.
మరోవైపు ఈ సినిమా టైటిల్ కోసం కూడా అన్వేషణ మొదలైంది. ‘మహారాజ్’, ‘గరుడ’ అనే టైటిల్స్ ఈ సినిమా కోసం పరిశీలించారని వార్తలొచ్చాయి. ఇవి రెండూ ఇప్పుడు పాత టైటిళ్లు అయిపోయాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ‘జనరేషన్’ అనే అర్థం వచ్చేలా ఓ పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఈ కథకు తరతరాల లింక్ వుంది. అందుకే అలాంటి టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నీ రాజమౌళి బయటకు రివీల్ చేయనివ్వడం లేదు. కనీసం ప్రియాంకా చోప్రాని ఎంచుకొన్న సంగతి కూడా మీడియాకు చెప్పలేదు. మీడియాలో ఎన్ని రకాల వార్తలు వస్తున్నా వాటిపై రెస్పాండ్ అవ్వడం లేదు. సినిమా మొదలెట్టే ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి, ఆ చిత్ర వివరాల్ని మీడియాతో పంచుకోవడం రాజమౌళికి అలవాటు. దాన్ని కూడా ఈసారి పక్కన పెట్టేశారు. మరి ఈ సస్పెన్స్ కు శుభం కార్డ్ ఎప్పుడో?