ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పడం కన్నా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఓడించింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసే బీజేపీ.. అసెంబ్లీకి వచ్చే సరికి కేజ్రీవాల్ ముందు ఎప్పుడూ తల వంచాల్సి వచ్చేది. కానీ ఈ సారి మాత్రం పదకొండేళ్ల పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలతో గడ్డు పరిస్థితి ఎదురవుతుందని తెలిసినా.. మిత్రుల్ని కలుపుకుని పోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ను దూరం చేసుకోవడమే కాదు.. అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని అతిశయోక్తికి పోయి మొదటికే మోసం తెచ్చుకున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లు 47 శాతం. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 43 శాతం కన్నా కాస్త ఎక్కువ . అంటే రెండు పార్టీల మధ్య తేడా మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ తో ఆప్ కలసి పని చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కలసి రాలేదు. ఆ స్నేహాన్ని కొనసాగించి ఉంటే.. ఓట్ల బదిలీ జరిగి ఉండేది. కేజ్రీవాల్, సిసోడియా వంటి వాళ్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారైనా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు.
గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ సారి కూడా రాలేదు. కానీ ఈ సారి నాలుగు శాతం ఓట్లు పెరిగాయి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయింది. హర్యానాలో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేసింది. అక్కడ ఆమ్ ఆద్మీని కలుపుకుని ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. కానీ చేయలేదు. ఢిల్లీలో ఆప్ అదే తప్పు చేసింది. నిండా మునిగిపోయింది. ఇప్పుడు చేతులు కాలిపోయాయి.. ఆకులు పట్టుకుని కూడా ప్రయోజనం ఉండదు.