గోదావరి పుష్కరాలను చాలా అట్టహాసంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కృష్ణా పుష్కరాలకి సన్నాహాలు చేస్తోంది. పుష్కరాలంటేనే లక్షలాది ప్రజల మత విశ్వాసాలతో కూడుకొన్న విషయం. అటువంటి కార్యక్రమం కోసం పనులు చేస్తున్నప్పుడు అనాలోచితంగా దేవాలయాలని కూల్చివేయడం ఒక పొరపాటు అనుకొంటే, ప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా తెదేపా నేతలు మాట్లాడటం మరో పెద్ద పొరపాటు.
గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో జరిగిన త్రొక్కిసలాటలో 32మంది మరణించడం, ఆ తరువాత మళ్ళీ రాజమండ్రిలోనే భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఎంత గొప్పగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటువంటి కారణాల వలన ప్రభుత్వానికి వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అయింది. గోదావరి పుష్కరాలను ఆర్భాటంగా నిర్వహించిన క్రెడిట్ అంతా తనకి మాత్రమే దక్కాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు అందరినీ పక్కనబెట్టి, అన్నీ తానై పూనుకొని చేయడం వలన ఆ అప్రదిష్ట కూడా ఆయన పద్దులోనే జమా అయ్యింది. గోదావరి పుష్కరాలలో జరిగిన వైఫల్యాలకి పూర్తి భాద్యత ఆయనదే అయ్యింది.
ఇప్పుడు కృష్ణా పుష్కరాల పనులు ప్రారంభంలోనే రోడ్లు వెడల్పు చేయడం కోసం గుళ్ళు కూల్చివేసి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తెదేపా నేతల ఇళ్ళని కాపాడేందుకే గోశాలవైపు రోడ్డు విస్తరణ చేపట్టి గోశాలని, కొన్ని గుళ్ళని కూల్చివేశారనే ఆరోపణలకి ప్రభుత్వం వద్ద తగిన సమాధానం లేదు. ఇటువంటి అనాలోచిత చర్యలని సమర్ధించుకొంటూ తెదేపా నేతలు వాదించడం వలన మిత్రపక్షమైన భాజపాతో కూడా గొడవలు పడవలసి వస్తోంది. ప్రతిపక్షాల నుంచి, హిందూ పీఠాదిపతుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ప్రజల కోసం పుష్కరాలు నిర్వహించబోయి వారి మత విశ్వాసాలని దెబ్బతీసి వారి దృష్టిలోనే ప్రభుత్వం చెడ్డదయింది. ఇవన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలననే ఎదురవుతున్న సమస్యలని చెప్పక తప్పదు. ప్రభుత్వానికి సంబందించిన ఏ వ్యవహారంలోని ప్రతిపక్షాలని సంప్రదించాలని అది అనుకోదు. కనీసం మిత్రపక్షమైన భాజపాని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం వలననే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గోదావరి పుష్కరాలలో జరిగిన పొరపాట్లే మళ్ళీ కృష్ణా పుష్కరాలలో కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడటం మంచిది. లేకుంటే ఇటువంటి ప్రతీ సమస్యకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఇటువంటి ఘటనలు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి పుష్కరాలు అచ్చిరాలేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.