శుక్రవారం విడుదలైన ‘తండేల్’కు బాక్సాఫీసు దగ్గర మంచి ఆరంభమే లభించింది. తొలి రోజు వసూళ్లు బాగున్నాయి. నాగ చైతన్య – సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చింది. అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికీ మంచి మార్కులు పడ్డాయి. పాటలు ఆల్రెడీ హిట్టు. నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించగలిగాడు దేవిశ్రీ. ఈ సినిమాకు మరో హీరోగా నిలిచాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ కూడా ఒప్పుకొన్నారు. దేవిశ్రీ సంగీతం పక్కన పెట్టి చూస్తే ‘తండేల్’ బిలో యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయేది.
ఈ క్రెడిట్ లో కొంత అల్లు అర్జున్‌కు చెందుతుంది. ఎందుకంటే ‘తండేల్’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోవాలనుకొన్నప్పుడు అల్లు అరవింద్ కాస్త సందేహపడ్డారు. అప్పటికే ‘పుష్ప 2’తో దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీ. అంత బిజీలో `తండేల్`కు టైమ్ కేటాయించగలడా, లేదా? అనేది అరవింద్ అనుమానం. దాంతో వేరే సంగీత దర్శకుడ్ని ఎంచుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ బన్నీ మాత్రం ‘లవ్ స్టోరీ అంటే దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే’ అని అల్లు అరవింద్ కు సర్ది చెప్పారు. అది బాగా వర్కవుట్ అయ్యింది. దేవి లేకపోతే, తన పాటలు లేకపోతే.. ‘తండేల్’ పరిస్థితి ఎలా ఉండేదో?
లవ్ స్టోరీ అంటే దేవికి కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. అప్పట్లో ‘ఉప్పెన’కు కూడా ఇలానే ఫ్రెష్షుగా ట్యూన్లు చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొదట్టాడు. ఇప్పుడు ‘తండేల్’తో తనని తాను మళ్లీ నిరూపించుకొన్నాడు. ఇక మీదట లవ్ స్టోరీలు అనగానే.. దేవిశ్రీ ప్రసాదే గుర్తొస్తాడు. ఆ స్థాయిలో ‘తండేల్’ని ప్రభావితం చేశాడు దేవిశ్రీ.