మూఢభక్తి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ప్రజలను మళ్ళించవలసిన సన్యాసులు, సాధువులు రోడ్డు మీద పడి శాపనార్ధాలు మొదలు పెట్టారు…జరిగిన తప్పు మీద భాగస్వామ్య పక్షం నుంచి సంజాయిషీ కూడా కోరడానికి అవకాశం వున్న బిజెపి రోడ్డెక్కి తన పేటెంటు హక్కుని కాపాడుకోడానికే అన్నట్టు రగడమొదలు పెట్టింది.
మొరటు తనానికి తానే ప్రతినిధిని అనిపించే తీరులో, విజయవాడ తనకి మాత్రమే సొంతమనే మూర్ఖపు భాషలో ఎంపి స్పందిస్తున్నారు. ఆధునిక చరిత్రలో హేతుబద్దతని, శాస్త్రీయమైన అవగాహనను, దృక్పధాన్ని ప్రజలకు పరిచయం చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మరచిపోయాయి. చేసిన పని మంచిదే కాని ముందుగా చెప్పి గుడులను తొలగించి వుండాలని సన్నాయి నొక్కలు నొక్కుతున్నాయి. చంద్రబాబు మీద విరుచుకు పడిపోవడమే తప్ప మరో కార్యక్రమమే లేని ప్రతిపక్షం గురించి మాట్లాటుకోకపోవడమే మంచిది.
అందరూ కలిసి ప్రజలతో ఆడుకుంటున్నారు. మత సాంప్రదాయాలకు దూరంగా, అతీతంగా ఉండవలసిన ప్రభుత్వాలు రోజువారీ కార్యకలాపాలకు కూడా ముహూర్తాలు పెట్టించడంతో మొదలైన అశాస్త్రీయత, కెసిఆర్ చండీ యాగం చేయించడం వరకు, ఎన్నికల్లో అయోధ్యరాముడే బిజెపి వైపు ఫిక్సయిపోవడం వరకూ, చర్చిలే జగన్ కు ఓట్లు రాబట్టే వరకూ వ్యాపించింది.
ఇందులో ఒక పర్యావసానమే విజయవాడలో గుడులు కూల్చివేసిన రగడ!
అనుకున్నది సాధించాలన్న నైపుణ్యమో తాపత్రయమో తప్ప, అన్నిమతాలనూ గౌరవించడం తప్ప చంద్రబాబు సొంతానికి ఎలాంటి మత విశ్వాసమూ ఉన్నట్టు అనిపించదు.
ముఖ్యమంత్రిగా రెండు గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరానికి ఫేస్ లిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు కి ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి కృష్ణా పుష్కరాలు నిర్వహించే అవకాశం వచ్చింది. రాజధాని ప్రాంతంలో వున్న మహానగరమైన విజయవాడకు ఫేస్ లిఫ్ట్ ఇవ్వడానికి ఈ చాన్స్ తీసుకున్నారు. ఏమి అడ్డు వచ్చినా కొట్టెయ్యాలని ఆదేశించారు. చంద్రబాబుకి మతవిశ్వాసాలు వుండి వుంటే గుడులజోలికి వెళ్ళేవారు కాదు… వెళ్ళినా అన్ని ఉపశాంతులూ జరిపించే పని మొదలు పెట్టించే వారు.
గుడులు కూల్చేశాక రేగిన వివాదానికి చంద్రబాబు కంగారు పడలేదు. ఇద్దరు బిజెపి మంత్రులతో సహా కమిటీ వేసి బిజెపికి చెక్ చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా చూస్తామని చెప్పేసి గొడవ ముగించేశారు.
ఇది మతవిశ్వాసాలకు ఎదురీదడం కాదు. ముందుకి సాగిపోయే ప్రయాణంలో చిన్న అవరోధాలను పక్కన పెట్టేస్తూ సాగిపోవడమే! దేవుడే కదా అని (మూడంగుళాలకు మించిన) విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోము కదా? అలాగే ట్రాఫిక్ పెరిగిన ఇరుకు రద్దీలో గుళ్ళు , దేవుళ్ళ మీద దుమ్మూ ధూళి పేరుకు పోవడం గౌరవం కాదుకదా!
సాధువులు గాడితప్పిన చోట, బిజెపి ఆవేశాన్ని అదుపుచేసుకోలేకపోయిన చోట, కమ్యూనిస్టులు విఫలమైన చోట, హేతువాదులు ఉదాసీనంగా వున్నచోట ముఖ్యమంత్రి సమస్యని బాగా హేండిల్ చేశారు. చంద్రబాబు నాయుడు నాస్తికుడు కాకపోవచ్చు… ఆయన భౌతికవాది…హేతువాది…పనినే దైవంగా భావించే వర్క్ హాలిక్!