కొద్ది రోజుల కిందట వరకు చేవెళ్ల వైపు అంటే ఫామ్ హౌస్‌లు, ఫామ్ ప్లాట్లే అమ్మకానికి పెట్టేవారు. 111 జీవో ఓ కారణం అయితే.. ఆ పరిధి దాటిన తర్వాత హైదరాబాద్‌కు కాస్త దూరం అన్న భావన రావడమే కారణం. దీంతో ఎక్కువగా ఫామ్ ప్లాట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మార్కెట్ చేసేవారు. అయితే ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు వస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది.
శంకర్ పల్లి మండలంలో విల్లాల సంస్కృతి పెరుగుతోంది. మొయినాబాద్ మండలంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్‌ల నిర్మాణాలు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వాటి పక్కనే ఉన్న చేవెళ్ల, షాబాద్ మండలాల వైపు వ్యాపారులు, కొనుగోలుదారులు దృష్టి సారించారు. ఇక్కడ భూముల విలువ తక్కువగా ఉండడం పెట్టుబడులకు అనుకూలంగా మారింది. చేవెళ్ల మండలంలోని అంతారంలో ఓ ప్రైవేటు కంపెనీ పెద్ద ఎత్తున విల్లాలు నిర్మించి అమ్మకాలు చేస్తోంది. కందవాడ, చేవెళ్ల, దామరగిద్ద గ్రామాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్లుగా ఉండటంతో చిన్న చిన్న బిల్డర్లు కూడా కాలనీల్లో నిర్మాణాలు ప్రారంభించారు.
చేవెళ్ల పట్టణంతో పాటు కందవాడ, ఆలూరు, గుండాల, షాబాద్ మండలాల్లో నాగర్‌గూడ, చందన్‌వెళ్లి, హైతాబాద్ ప్రాంతాల్లో లే ఔట్లు జోరుగా వేస్తున్నారు. హెచ్ఎండీఏ అనుమతులతో చేసిన వెంచర్లలో ప్లాట్లకు గజం సగటున రూ. 16 వేల పైనే ఉంటోంది. ఇప్పుడు ఇక్కడ ఓ ఇల్లో.. ఇంటి స్థలమో కొనుగోలు చేసి పెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యేసరికి.. హైదరాబాద్ అడ్రస్ కింద చేరిపోయినా ఆశ్చర్యం ఉండదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.