నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా 19మందిని కేంద్రమంత్రులుగా చేర్చుకోగా, పనితీరు సంతృప్తికరంగా లేని కారణంతో కొందరు సీనియర్ మంత్రులను వేరే శాఖలకి మార్చారు. మొదటి నుంచి అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా నిలుస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీని చేనేత, జౌళి శాఖకి మార్చారు. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడని గణాంకాల శాఖకి మార్చారు. చౌదరి బీరేంద్ర సింగ్ ని గనుల శాఖకి మార్చారు.
ఇంతవరకు స్మృతీ ఇరానీ నిర్వహిస్తున్న మానవ వనరుల శాఖని క్యాబినెట్ హోదా కల్పించబడిన ప్రకాష్ జవదేకర్ కి అప్పగించారు. న్యాయశాఖని రవిశంకర్ ప్రసాద్ కి అప్పగించారు. సమాచార, ప్రసార శాఖని వెంకయ్య నాయుడుకి అప్పగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖని నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడుకి ఇది అదనపు బాధ్యత అవుతుంది. కానీ ఆయన నిర్వహిస్తున్నపార్లమెంటరీ వ్యవహారాల శాఖని కర్నాటకకి చెందిన అనంతకుమార్ అప్పగించారు. విజయ్ గోయల్ కి క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, అనిల్ మాధవ్ దవేకి స్వతంత్ర హోదాతో అటవీ, పర్యావరణ శాఖ దక్కింది.
స్మృతీ ఇరాని, సదానంద గౌడ, చౌదరి బీరేంద్ర సింగ్ వంటి సీనియర్ మంత్రులని ఎటువంటి మొహమాటం లేకుండా అప్రదాన్యమైన వేరే శాఖాలకి మార్చడం, బాగా పని చేసిన వారికి పదోన్నతి కల్పించడం లేదా కీలకమైన శాఖలు కట్టబెట్టడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రులకి చాలా బలమైన సందేశమే ఇచ్చినట్లు భావించవచ్చు.
అయితే ఆర్.ఎస్.ఎస్. మద్దతు ఉన్న బండారు దత్తాత్రేయ, తవార్ చాంద్ గెహ్లాట్ ల పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ వారిని తమ పదవులలో కొనసాగనీయడం విశేషమే. ఇక ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ల శాఖల మారుస్తారన్న వార్తలు నిజం కాదని స్పష్టం అయింది.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆయనని హోంమంత్రి పదవిలోనే కొనసాగించారు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా లేదా ప్రత్యర్ధ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను ఇంకా ఖరారు చేయనందున లేదా అసలు ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే ఆలోచన లేకపోవడం చేత ఆయనని అదే పదవిలో కొనసాగించినట్లు భావించవలసి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన కార్యక్రమాలు ముగిసాయి కనుక మోడీ ప్రభుత్వం ఇంక ఈనెల 18 నుండి మొదలవబోయే పార్లమెంటు సమావేశాలకి సిద్దంగా ఉన్నట్లే భావించవచ్చు.