నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ ను వైసీపీలోకి ఆహ్వానించారు. గాలి జగదీష్ కు.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు గాలి భానుప్రకాష్ కు సరిపడటం లేదు. తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిదయింది. ఓ సందర్భంలో ఇద్దరూ టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు భాను ప్రకాష్ వైపే మొగ్గారు. తల్లి మద్దతు జగదీష్ కే ఉంది.
అయితే జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన గతంలో చేసిన పనుల వల్ల చంద్రబాబు ఆయనను దూరం పెట్టారు . ఇప్పుడు జగదీష్ వేరే పార్టీలో చేరి అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఆయనకు వైసీపీ స్వాగతం పలుకుతోంది. రెండు రోజుల్లో చేర్చుకోవాలని అనుకుటున్నారు. ఈ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదు కానీ.. విషయం మాత్రం ఆమెకు తెలిసిందని అంటున్నారు. జగదీష్ ను చేర్చుకుంటే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. నిజానికి పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయనను తప్పించారు. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న నగరి కీలక నేతల్ని సస్పెండ్ చేయించారు. దాంతో అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నారు కానీ.. అలాంటి పరిస్థితి లేదని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకోవడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నారో లేదో కానీ..ఆ చేరిక ఆపలేకపోతే నగరిలో మాత్రం రోజాకు సీటు దక్కడం కష్టమవుతుందన్నఅభిప్రాయం చిత్తూరు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.