2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హీరో విజయ్ పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా ఆయన స్ట్రాటజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. అందరికీ సెంటిమెంట్ గా మారిన ప్రశాంత్ కిషోర్ తో ఆయనసమావేశం అయ్యారు. పూర్తి స్థాయిలో సలహాదారుగా పని చేయకపోయినా అప్పుడప్పుడూ తనకు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. ఆయన సలహా మేరకు తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ అనుకుంటున్నారు. భద్రతా కారణాలతో సాధ్యం కాకపోతే బస్సు యాత్ర చేయనున్నారు.
తమిళనాడులో గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డీఎంకేకు స్ట్రాటజిస్టుగా పని చేశారు. నిజానికి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగా డీఎంకే విజయం ఖాయమన్న ప్రచారం ముందు నుంచీ ఉంది. అనూహ్యంగా అన్నాడీఎంకే ఏకపక్ష విజయాన్ని డీఎంకే ఇవ్వలేదు. గట్టిగానే పోరాడింది. మంచి సీట్లు సాధించింది. అయినా డీఎంకే విజయంలో ప్రశాంత్ కిషోర్ కు వాటా లభించింది. అన్నాడీఎంకేకు సునీల్ కొనుగోలు స్ట్రాటజిస్టుగా పని చేశారు. అక్కడ అన్నాడీఎంకేకు వచ్చిన ఫలితాలతోనే ఆయనకు మంచి ఫోకస్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ కు సేవలు అందించడం ప్రారంభించారు. ఇప్పుడు పార్టీ వ్యూహాల్లో ఆయనదే కీలక పాత్ర అవుతోంది.
విజయ్ ఎన్నికల్లో డీఎంకేను ఓడించడం అంత తేలిక కాదు. సిద్దాంత పరంగా రెండు పార్టీలు డీఎంకే,అన్నాడీఎంకే బలంగా ఉన్నాయి. వారి నుంచి ఓటు బ్యాంకులను లాక్కుని తన పార్టీకి మద్దతు ఉండేలా చేసుకోవడం చాలా కష్టం. అయితే విజయ్ డీఎంకేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అన్నాడీఎంకే ఉనికిని ఆయన గుర్తించడం లేదో లేకపోతే కలసి పని చేయాలన్న ఆలోచనలో ఉన్నారో స్పష్టత లేదు. తనకు ఒక్కరే ప్రత్యర్థి అని ఆయన డిసైడయ్యారు. ముఖాముఖి పోరు జరగాలనే పద్దతిలో వెళ్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ సలహాలేనని భావిస్తున్నారు. మొత్తంగా పీకే.. డీఎంకే నుంచి విజయ్ టీవీకే పార్టీ వైపు మారడం మాత్రం.. తమిళనాట సెంటిమెంట్ ను కాస్త మారుస్తోందని అనుకోవచ్చు.