జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పర్యటనకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. 4 రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదటగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు.
పవన్ పర్యటన తమిళనాడులోనే ఎక్కువగా జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఈ విషయంలో తమిళనాడులోనూ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ తమిళనాడులో ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అక్కడి రాజకీయాల్లో పవన్ పర్యటన రాజకీయంగా ఓ టాపిక్ అవుతుంది. తమిళంలో అనర్గళంగా మాట్లాడగలిగే పవన్ కల్యాణ్ ఎం మాట్లాడినా అది ఖచ్చితంగా రాజకీయం అవుతుంది. అందుకే పవన్ పర్యటన రాజకీయంగానూ పెను సంచలనం అయ్యే చాన్స్ ఉంది.
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు పూర్తి వ్యతిరేకత దశలో ఉండే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే ఆ పార్టీ తన భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది . దానికి అనేక కారణాలు ఉన్నాయి. పవన్ పర్యటనతో జరిగే చర్చలతో కొంత అయినా మార్పు వస్తే.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మిగతా సంగతి చూసుకుంటారని బీజేపీ పెద్దలు భావించే అవకాశం ఉంది.