చిలుకూరు ఆలయ బాలాజీ అర్చకుడు రంగరాజన్ సౌందర రాజన్ పై రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన ముఠాతో కలిసి చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఆరెస్సెస్ సహా అందరూ ఖండించారు. ఈ వీరరాఘవరెడ్డి ఎవరు అని ఆరా తీస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం పేరుతో ఓ సంస్థాను స్థాపించి అందులో డబ్బులు కట్టి సైన్యంగా చేరాలని పిలుపునిచ్చారు. ఎంత మందిని చేర్చుకున్నారో తెలియదు కానీ ఆయన హింసాత్మక మార్గమే హిందూత్వం అన్నట్లుగా చెలరేగిపోతూ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రామరాజ్యం పేరుతో సమాజంలో అశాంతిని నెలకొల్పేందుకు భారీ కుట్ర చేసినట్లుగా ఈ వీరరాఘవరెడ్డి తీరు ఉంది. ఆయన ముఠా సభ్యులుఎవరు.. వారికి ఫండింగ్ ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అంతకు మించి ఆయన చిలుకూరు బాలాజీ ఆలయ ఆర్చకుడ్ని ఎందుకు టార్గెట్ చేశారన్నది కూడా కీలకమే. చిలుకూరు బాలాజీ ఆలయానికి ఎంతో పేరు ఉన్నప్పటికి అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాలేదు. రంగరాజన్ కుటుంబీకుల చేతుల్లోనే ఉంది. గతంలో హుండీ పెట్టిన ప్రతి ఆలయాన్ని స్వాధీనం చేసుకునే అధికారం దేవాదాయశాఖకు కేటాయిస్తూ చట్టం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లకూడదని.. చిలుకూరు ఆలయంలో హుండీని తీసేశారని చెబుతారు. అందుకే ఇప్పటికీ ఆలయం ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది.
చిలుకూరు ఆలయం అభివృద్ధి చెందలేదు . ఎప్పుడూ అంతే ఉంటుంది. దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడం వల్ల.. ఆ ఆలయాన్ని వీర రాఘవరెడ్డి సింపుల్ గా టార్గెట్ చేసి అక్కడే అడ్డగా మార్చుకుని ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కుట్ర చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ఆయన చెప్పుకోవడం దానికి నిదర్శనమని చెబుతున్నారు. వీర రాఘవరెడ్డితి హిందూత్వం కాదని.. సైకోయిజమని ఆయన వీడియోలు.. రంగరాజన్ పై చేసిన దాడితో స్పష్టమయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.