రేవంత్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకించే మంద కృష్ణ మాదిగ చివరికి ఆయనకు సోదరుడిగా అండగా ఉంటానని ప్రకటించాల్సి వచ్చింది. అలా వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం మార్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చావు డప్పు కొడతానని మందకృష్ణ ఉద్యమం ప్రకటించి వారం రోజులు కాక ముందే యూటర్న్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. వర్గీకరణ రిజర్వేషన్ తీర్మానాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మందకృష్ణ ఒక్క సారిగా ఇలా రేవంత్ రెడ్డి ఫ్యాన్ గా మారిపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన బీజేపీకి మద్దతుదారు. ప్రధాని మోదీకి అభిమాని. అయితే ఇప్పుడు తెలంగాణలో వర్గీకరణను ఎలాంటి సమస్య లేకుండా చేసినందుకు రేవంత్ రెడ్డిని అభినందించిక తప్పలేదు. ఇంకా సమస్యల ఉన్నాయని కొన్ని మాదిగ ఉపకులాల జనాభా, వారికి కేటాయింపులపై మార్పు చేర్పులు జరగాల్సి ఉందన్నారు. దానికి రేవంత్ రెడ్డి సబ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
మంద కృష్ణ మాదిగ సపోర్టు రేవంత్ రెడ్డి చాణక్య రాజకీయమే అనుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పెట్టిన మందకృష్ణ .. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత తొలి సారిగా తెలంగాణ సీఎం అసెంబ్లీలో వర్గీకరణ చేస్తానని ప్రకటించినప్పుడు అభినందించ లేదు. పైగా పదే పేద రేవంత్ పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్ గా మారిపోయారు.