తెలంగాణలో రాజకీయాలు వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డిని గౌరవించే ప్రశ్నే లేదని అంటున్న కేటీఆర్ ఆయనపై వీలు దొరికినప్పుడల్లా తిట్లందుకుంటూనే ఉన్నారు. సీఎం సీటుకు కూడా ఆయన గౌరవం ఇవ్వడం లేదు. ఇటీవలి కాలంలో ఆయన మరో కొత్త పదం ఒకటి ప్రతి సభలోనూ చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని అన్ని చోట్లా తెగ తిట్టేసతున్నారని ఆ తిట్లను వింటే ఇంకొకళ్లు అయితే సిగ్గుతో ఆత్మహత్య చేసుకునేవారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తుడిచేస్తున్నాడని అంటున్నారు. ఒక సారి కాదు పదే పదే అంటున్నారు.
కేటీఆర్ ఉద్దేశం ఏమిటో కానీ.. రేవంత్ ప్రాణాల గురించి అలా మాట్లాడటం మాత్రం వివాదాస్పదమవుతూనే ఉంది. అయితే ఆయన మాత్రం తగ్గడం లేదు. రేవంత్ రెడ్డి కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు. ఇటీవల మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఉపఎన్నికల గురించి కేటీఆర్ చెబుతున్నారని.. ఉపఎన్నికలు ఎందుకు వస్తాయని రేవంత్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందన్నారు. ఈ విషయాన్ని చిట్ చాట్ లో పాల్గొన్న జర్నలిస్టులు రిపోర్టు చేశారు. కానీ పూర్తిగా ఆఫ్ ది రికార్డు. ఆధారం ఉండదు. కానీ కేటీఆర్ మాత్రం నేరుగా సభల్లోనే మైకు ముందు ప్రసంగిస్తున్నారు.
రాజకీయాలను రాజకీయాలుగా చూసే పరిస్థితి లేకుండా పోయింది. వ్యక్తిగత విమర్శలు , బూతుల స్థాయి దాటి ఇప్పుడు ఒకరి చావుల గురించి మరొకరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు హర్షించరు కానీ.. ఒకరు ప్రారంభించినప్పుడు మరొకరు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అది రాజకీయ విలువల్ని దిగజారుస్తోంది. రెండు వర్గాలు సంయమనం పాటించినప్పుడు మాత్రమే కాస్తంత విలువలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్న సంగతిని వీరు మర్చిపోతున్నారు.