గవర్నర్ నరసింహన్ బుదవారం సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులే గవర్నర్ దగ్గరకి వెళ్లి కలిసి మాట్లాడుతుంటారు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకొంటే గవర్నరే ముఖ్యమంత్రిని రాజ్ భవన్ కి పిలిపించుకొని మాట్లాడతారు. కానీ గవర్నర్ నరసింహన్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి తనే విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రిని కలవాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
హైకోర్టు విభజన చేయాలని కోరుతూ తెలంగాణాలో న్యాయాధికారులు చేస్తున్న సమ్మె కారణంగా తెలంగాణా న్యాయవ్యవస్థలో సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ విభజన గురించి చర్చించి ఆ సమస్యని పరిష్కరించడం కోసమే గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలబోతున్నారు. గవర్నర్ ఈవిధంగా చొరవ తీసుకోవడం అభినందనీయమే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకి సహకరిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందరూ హర్షిస్తారు.
తెలంగాణా ప్రభుత్వం కేవలం కొన్ని సమస్యలనే అతిపెద్ద సమస్యలుగా చూపిస్తూ, మిగిలినవాటి గురించి పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సెక్షన్స్: 9,10 ల క్రింద వచ్చే సంస్థల విభజన, నీటి పంపకాలు వగైరా సమస్యలపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదు? వాటి పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించడం లేదు? అనే చంద్రబాబు ప్రశ్నకి నేటికీ కెసిఆర్ నుంచి సమాధానం లేదు. కనుక హైకోర్టు విభజన విషయంలో అయన గవర్నర్ కి సహకరిస్తారని ఆశించలేము. ఆయన చెపుతున్న సమస్యల పరిష్కారానికి కెసిఆర్ సహకరిస్తేనే, ఆయన కూడా హైకోర్టు విభజనకి సహకరిస్తారని భావించవచ్చు. కనుక గవర్నర్ ఇరువురు ముఖ్యమంత్రులని ఒప్పించవలసి ఉంటుంది.
ఈ సమస్యలన్నీ కొత్తగా ఏర్పడినవి కావు. వాటి వలన రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. అయినా కూడా ఇరువురు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల కోసం ప్రజల కోసం తమ అహాన్ని, బేషజాలని, రాజకీయ విభేదాలని పక్కనబెట్టి మాట్లాడుకోవడానికి సిద్దంగా లేరు. ఇప్పటికీ ఇరువురు ముఖ్యమంత్రుల వైఖరిలో పెద్దగా మార్పు కనబడటం లేదు. కనుక వారిద్దరినీ గవర్నర్ ఒప్పించగలరో లేదో వేచి చూడాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ సాంప్రదాయాన్ని పక్కనబెట్టి ఈవిధంగా ముఖ్యమంత్రుల చుట్టూ తిరగవలసి రావడం హర్షణీయం కాదు. కనుక ముఖ్యమంత్రులు ఇద్దరూ ఆయన పెద్దరికాన్ని గౌరవించి, సలహాలని పాటించి సమస్యల పరిష్కారం కోసం ఆయనకీ సహకరిస్తే బాగుంటుంది.