మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అంటే టీడీపీ నేతలకు పీకల మీద వరకూ కోపం. ఐపీఎస్ అధికారిగా జగన్ కోసం ఆయన అన్ని రకాల గీతలు దాటేశారు. అడ్డగోలు పనులు చేసి టార్చర్ పెట్టిన ఆయనను వదిలి పెట్టాలని టీడీపీ నేతలు అనుకోవడం లేదు. ఆయన కారణంగా చావు వరకూ వెళ్లిన రఘురామ అయితే ఇన్స్టంట్గా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయనను రౌండప్ చేసి.. భవిష్యత్ లోనూ ప్రశాంతంగా ఉండకుండా చేసిన తప్పులకు శిక్ష అనుభవించేలా రౌండప్ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇతర కస్టోడియల్ టార్చర్ కేసుల్లో విచారణలు
సునీల్ కుమార్ టీడీపీ నేతలను అర్థరాత్రుళ్లు పట్టుకు వచ్చి చితకబాదేవారు. ఆయన బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఓ లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసుకుని బాధితుల వివరాలు తీసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అసలు అరెస్టే అవసరం లేని కేసుల్లో తమను ఎలా టార్చర్ పెట్టారో వాంగ్మూలాలు ఇస్తున్నారు. డాక్టర్ల నివేదికలు సమర్పిస్తున్నారు.
సునీల్ మత సంస్థపై గుట్టుగా వివరాల సేకరణ
పీవీ సునీల్ కుమార్ ఓ మత సంస్థను నడుపుతున్నారు. దానిపై అంబేద్కర్ ఇండియా మిషన్. ఆ సంస్థ పేరుతో మత మార్పిళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు గతంలోనే కేంద్రానికి వెళ్లాయి. గతంలో ఆయన దేశాన్ని కించ పరిచేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా కేంద్రం వద్ద ఉన్నాయి. అలాగే సమాజంలో విబేధాలు పెంచేలా.. ఆయన చేస్తున్న వ్యవహారాలపైనా గుట్టుగా వివరాల సేకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ కలిపి ఒక్క సారే ఆయనపై పిడుగులా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరో ఐపీఎస్ అలా చేయకుండా శిక్షించబోతున్నారా?
ఐపీఎస్ అధికారులు దారి తప్పితే. .చట్టాలను ఉల్లంఘిస్తే అది తీవ్రమైన విషయం. వారే అలా చేస్తే ఇక చట్టాలను అమలు చేసేది ఎవరు?. పౌరుల హక్కులను కాపాడటం వారి విధి. కానీ వారు రాజకీయ ముసుగులో చేరి.. రాజకీయ బాసుల ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు ఆ అధికారాన్ని ఉపయోగించడం.. అడ్డగోలుగా సామాన్య పౌరుల హక్కులను హరించడం చిన్న విషయం కాదు ఇలాంటి వారిని అలా వదిలేస్తే మరింత మంది అదే దారిలో వెళ్తారు. అందుకే సునీల్ పై ఎవరూ ఊహించనంత కఠినంగా వ్యవహరించబోతున్నట్లుగా చెబుతున్నారు.