సువర్ణ భూమి పేరుతో కొంత కాలం కిందటి వరకూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. కానీ ఇప్పుడు దాన్ని నమ్మిన వాళ్లు పట్టే మునిగారు. పెద్దగా విలువలేని భూముల్ని బైబ్యాక్ పేరుతో అంటగట్టి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు. ఇప్పుడీ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రిల్ సంస్థ కోట్లు వసూలు చేసింది.
స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ.. భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడినట్లుగా పలు కేసులు నమోదయ్యాయి. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద నుంచి 30 లక్షల నుంచి రెండు కోట్ల వరకు స్వాహా చేసింది పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తరువాత 24 శాతం లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చింది.
గతేడాది డిసెంబర్లో సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల నుంచి సువర్ణభూమి డైరెక్టర్లు మోసం చేస్తున్నారని, చెల్లని చెక్కలు ఇచ్చి, వారి కార్యాలయల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు కేసు పెట్టారు. ప్రముఖ సినీ హీరోలు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని, 200 మంది భాధితులు ఉన్నామని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని అంటున్నారు. సువర్ణ భూమి మోసాల చిట్టా పెద్దగా ఉండటంతో.. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.
రియల్ ఎస్టేట్‌లో బైబ్యాక్ పేరుతో గుట్టుగా చేసిన మోసాల్లో సువర్ణభూమి సంస్థ చేసింది అతి పెద్దదిగా భావిస్తున్నారు.