కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు పవన్ కల్యాణ్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. రెండు రోజుల పాటు సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలు కూడా వివరించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో మాత్రం పాల్గొనలేదు. అంత కీలక సమావేశానికి పవన్ సామాన్యంగా హాజరు కాకుండా ఉండరు. పాలనపై పట్టు సాధించుకోవడానికి అలాంటివి బాగా ఉపయోగపడతాయి. కానీ ఆయన గైర్హాజరయ్యారు.
చంద్రబాబు ఫోన్కు అందుబాటులోకి రాని పవన్
మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి హాజురు కాకపోవడంతో చంద్రబాబు నాదెండ్ల మనోహర్ ను అడిగారు. ఆయన పవన్ కు తీవ్రమైన నడుంనొప్పి ఉందని అందుకే రాలేకపోతున్నారని చెప్పారు. చంద్రబాబు కూడా తాను పవన్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేశానని అయినా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఆశ్యర్యపోయారు. సీఎం సంప్రదించినా అందుబాటులోకి రాకపోవడం అంటే.. చిన్న విషయం కాదని చర్చించుకోవడం ప్రారంభించారు.
నెల రోజులుగా అధికార కార్యక్రమాలకూ దూరం !
పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ అని.. అందుకే కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కావడం లేదని జనసేన పార్టీ ఇటీవల ఓ ప్రెస్ నోట్ రిలీఫ్ చేసింది. ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. పవన్ కల్యాణ్ కుర్చీ ఖాళీగా ఉన్న కేబినెట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అధికారం చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు పవన్ తీరిక లేకుండా ఉన్నారు. విస్తృతంగా పర్యటనలు చేశారు. సమావేశాలు నిర్వహించారు. తన శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే హఠాత్తుగా ఆయన అధికారిక కార్యక్రమాల నుంచి కనిపించకుండా పోయారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికీ ఆయన వెళ్లకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
కేరళకు వెళ్లిన పవన్
అయితే ఆయన ఆలయాల సందర్శనకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడుకు వెళ్లారు. కొచ్చి ఎయిర్ పోర్టులో ఆయన నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆరోగ్యం కుదుటపడి ఉంటే.. ఒక్క రోజు జరిగే మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదన్నది హాట్ టాపిక్ గా మారింది. పవన్ కు అనారోగ్యం కాదని ఇంకేదో ఉందన్న ప్రచారానికి ఈ వ్యవహారం కారణం అవుతోంది.