జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండే రెండు, మూడు రోజుల్లో ఓ నియోజకవర్గ కార్యకర్తలను పిలిపించుకోవడం.. వారు చెప్పేది ఏమీ వినకుండా.. తాను డైలీ వేసే క్యాసెట్ ను వేయడం రొటీన్ వ్యవహారంలా మారుతోంది. బుధవారం కూడా గుంటూరు నేతల్ని పిలిపించుకున్నారు. గుర్తు పట్టగలిగే నేతుల నలుగురు, ఐదుగురు కూడా రాలేదు. కానీ వచ్చిన వారికే ఆయన పాత కథ వినిపించారు. అయితే రాసిచ్చిన వారు ప్రాస మార్చారో లేకపోతే జగనే కాస్త సిగ్గుపడ్డారో కానీ 30 ఏళ్ల సీఎం నినాదంలో కాస్త మార్పు తెచ్చుకున్నారు.
తాజాగా ఆయన ఏమని సెలవిచ్చారంటే ” తాను ఇంకా 25 నుంచి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా” అని చెప్పుకొచ్చారు. ఎదురుగా కూర్చున్న వారికి ఏమీ అర్థం కాలేదు. అన్న రాజకీయాల్లో ఉంటానన్నాడా లేకపోతే సీఎంగా ఉంటానన్నాడా అన్నది అర్థం కాలేదు. అయితే అలాంటివన్నీ మామూలేనని సర్ది చెప్పుకున్నారు. ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉండాలనుకుంటే అన్నేళ్లు ఉండవచ్చు. రాజకీయాల్లో ఉన్నానని అని చెప్పుకుంటే రాజకీయాల్లో ఉన్నట్లే. దానికి ఎవరి సర్టిఫికేషన్ అక్కర్లేదు. కానీ జగన్ సీఎంగా అనే మాటలను వదిలేయడంతోనే వైసీపీ కార్యకర్తల్లో జగన్ రియాలిటీలోకి వస్తున్నారన్న క్లారిటీ వస్తోంది.
ఎంత సేపు.. జగన్ 2.0 అని సినిమా డైలాగులు చెప్పడమే కానీ.. అసలు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే.. వన్ పాయింట్ జీరో లో ఏం చేశారో కాస్త చెప్పలేకపోయారు. ఏమీ చేయలేదని మాత్రం చెబుతున్నారు. ఆయనకు స్పీచ్‌లు రాసిచ్చేవారు మారిపోయారేమో తెలియదు కానీ.. ఒక స్పీచ్ కు..మరో స్పీచ్ మధ్య ప్రాస తేడాలు వస్తున్నాయి. కానీ మేము వస్తే అనే బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. వారు వచ్చినప్పుడు చేసిన నిర్వాకాల కారణంగానే ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఈ డైలాగులు ఏంటో చాలా మందికి అర్థం కావు.
జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం కావాల్సి ఉందని.. కనీసం కార్యకర్తల్ని యాక్టివ్ చేయాల్సి ఉన్నా ఆయన కదలడం లేదు. సంక్రాంతి తర్వాత అని చెప్పినా ఇప్పుడు .. మాట మార్చారు. కార్యకర్తల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉన్న జనగ్.. కూటమి పార్టీలకు ప్రజల్లో కి వెళ్లే ధైర్యం లేదని చెప్పుకొస్తున్నారు.