తమిళనాట ప్రశాంత్ కిషోర్.. డీఎంకేను ఓడించేందుకు ఓ ఫార్ములాను రెడీ చేశారు. గత ఎన్నికల్లో డీఎంకే కోసం పని చేసిన ఆయన ఈ సారి స్టార్ హీరో విజయ్ పార్టీకి సలహాలిస్తున్నారు. పూర్తి స్థాయి స్ట్రాటజస్టుగా కాకపోయినా గెలుపు కోసం అవసరమైన సలహాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తమిళనాడులో విజయ్ .. ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీఎంకేను ఒంటరిగా ఢీకొట్టి గెలవడం అసాధ్యమని స్ఫష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గెలుపు కోసం పీకే ఓ ఫార్ములాను ప్రతిపాదించారు.
అన్నాడీఎంకేతో పాటు కలసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకోవాలని ఆయన ఏపీ ఫార్ములా తరహాలో ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్ ను కూడా ఈ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే వెంటనే అప్రమత్తమయిన స్టాలిన్ ఆయనకు.. జూన్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కమల్ .. డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చారు.
అన్నాడీఎంకే సంస్థాగతంగా మంచి బలం ఉంది. గ్రామ స్థాయిలో కార్యకర్తల సైన్యం ఉంది. విజయ్ ఇటీవలే పార్టీ ప్రారంభించారు. ఆయనకు ఫ్యాన్స్ సంఘాలు తప్ప పార్టీ నిర్మాణం లేదు. సినిమా ఫ్యాన్స్ కు ..రాజకీయ కార్యకర్తలకు చాలా తేడా ఉంటుందని.. ఫ్యాన్స్స తో ఏమీ జరగదని పీకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా కూటమిగా ఉండేందుకు సిద్ధపడాలని సలహాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
విజయ్ కు కూడా తమిళనాడు రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఒంటరిగా వెళ్లి ఏదో చేయాలని ఆయన అనుకోవడం లేదని..కూటములుగా వెళ్లి విజయం సాధించే రాజకీయాలనే ఫాలో కావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన డీఎంకేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అన్నా డీఎంకేను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. సీట్ల దగ్గర తేడాలు రాకుండా చూసుకుంటే కూటమి ఏర్పడుతుందని తమిళనాట ప్రచారం జరుగుతోంది.