సినిమా ఈవెంట్ కి కాస్త ఇమేజ్ వున్న చీఫ్ గెస్ట్ ని తీసుకురావడం ఓ పెద్ద పని. చాలా ప్రయత్నాలు చేయాలి. వారం రోజుల ముందు డేట్ లాక్ చేసుకోవాలి. గుర్తు చేస్తూనే వుండాలి. వచ్చేవరకూ టెన్షనే. కానీ కొందరు వుంటారు. మంచి సినిమా అనిపిస్తే, యూనిట్ నచ్చితే ఓ పిలుపుతో వాలిపోతారు. రానా దగ్గుబాటి ఈ కేటగిరీలోకే వస్తారు.
బ్రహ్మాజీ లీడ్ రోల్ ‘బాపు’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు రామానాయుడులో జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులు ఎవరూ లేరు. దర్శకుడితో వున్న పరిచయంతో తిరువీర్ వెళ్లారు. అయితే ఇదే సమయంలో రానా అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మాజీ.. నేరుగా వెళ్లి బాపు ఈవెంట్ గురించి చెప్పడం, వెంటనే ఆయన ఈవెంట్ కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం జరిగిపోయింది. రానా రావడం తమకు చాలా హెల్ప్ అయ్యింది టీం అంతా హ్యాపీగా ఫీలౌతోంది.
నిజానికి ఓ ఈవెంట్ కి వెళ్ళడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ రానా అదే సమయంలో తన సినిమా ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ రీరిలీజ్ ని ప్రమోట్ చేసుకుంటూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత బాపు ఈవెంట్ కి వచ్చారు. ఒకేరోజు ఒకే యాక్టర్ రెండు ఈవెంట్లు అంటే… మీడియా వెయిటేజీ వుంటుంది. ముఖ్యంగా ప్రింట్ లో ఈ లెక్కలు ఎక్కువ వుంటాయి. ఒకే యాక్టర్ ఫోటోని రిపీట్ చేయడానికి అస్సల్ ఇష్టపడవు పత్రికలు. రానా మాత్రం అలాంటి లెక్కలు ఏమీ లేకుండా ఈవెంట్ కి వెళ్లి చిన్న సినిమాలపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు.