ఉచితాలు చేస్తున్న చేటుపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాల పేరుతో దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని వారు పనులు చేయడానికి ఆసక్తి లేకుండా చేస్తున్నారని మండిపడింది. సుప్రీంకోర్టు చెప్పకపోయినా ఈ అంశంపై చాలా కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయపార్టీలు పోటీలు పడి వినూత్న ఆలోచించి ఉచితాలు మీద ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఉత్పదకత లేని వర్గాన్ని సృష్టిస్తూ పోషిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా.. అసలు మార్పు రావాల్సింది మాత్రం రాజకీయ పార్టీల్లోనే.
ఉచితంగా వచ్చే దానికి విలువ ఏముంటుంది?
ఏదైనా కష్టపడితేనే రావాలి. ఉచితంగా వస్తే దానికి విలువ ఉండదు. ఎవరైనా ఉచితంగా ఓ లక్ష రూపాయలు ఇచ్చి చూడండి… వాటి విలువ తెలియని వ్యక్తుల క్షణాల్లో కాజేసుకుంటారు. అదే ఓ వ్యక్తి కష్టపడి లక్ష సంపాదించుకుంటే అతను దాన్ని తన అవసరాలకు మాత్రమే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ లక్ష సంపాదన కష్టం ఏమిటో అతనికి తెలుసు. కానీ ప్రభుత్వాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఓటు బ్యాంకును సృష్టించుకోవడం కోసం ఉచితంగా లక్షలు ఇస్తామంటూ ప్రజల్ని సోమరుల్ని చేస్తున్నారు.
తమపై ఆధారపడే బానిసల్లాగా ఓటర్లను మార్చుకునే కుట్రలు
ఇదిగో మీ కుటుంబానికి ఏడాదికి నాలుగు లక్షల లబ్ది చేకూర్చాం అని ఇంటింటికి పత్రాలు పంపించింది గత వైసీపీ ప్రభుత్వం . నిజంగా అంత లబ్ది చేశారో లేదో తేలియదు. కానీ.. ఆ పేరుతో పెద్ద ఎత్తున పన్నులు పిండుకున్నారు. అందరి దగ్గరా పన్నులు పిండుకుని టార్గెటెడ్ ఓటు బ్యాంకుకు మాత్రమే పంచారు. ఆ కారణంగా ఆ ఓటు బ్యాంక్ పని చేయకుండా నిర్వీర్యం అయిపోయింది. తమ మీదనే ఆధారపడి బతకేలా చేసి శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్నది ఆ పార్టీ ప్లాన్. అలాగే చేశారు. అమలు చేశారు. అంటే తమ మద్దతుదారులు పనులు చేయకుండా పేదరికంలోనే ఉండి తమపై ఆధారపడి ఉండేలా చేసుకున్నారు. దీన్ని ఏమంటారు ?
దేశ శక్తిని నిర్వీర్యం చేయడం దేశద్రోహమే !
ఖచ్చితంగా పని చేసుకోలేని వాడికి..ఆకలి తీర్చాల్సిందే. అంత వరకూ సంక్షేమం. అంతకు మించి ఇచ్చేది సంక్షేమం ఎందుకు అవుతుంది ?. దుబారా అవుతుంది. పని చేసే వర్గాన్ని నిలువు దోపిడీ చేసి పని చేయని వారిని పెంచి పోషించినట్లవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేసింది. మరి రాజకీయ పార్టీలు మారుతాయా.. ?. ఇలా ఆశించడం అత్యాశే.