వల్లభనేని వంశీని ఇప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. మామూలుగా అయితే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే ఆయనకు ఎరుపు రంగు కళ్ల ముందు కనిపించేలా చేయాల్సింది. కానీ చట్టప్రకారం చేస్తామని చెప్పి మెల్లగా న్యాయప్రక్రియ ద్వారా ఆయనపై కేసులను నడిపిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా తనకు లభించిన న్యాయపరమైన అవకాశాల్ని ఆయన వినియోగించుకున్నారు. అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. కానీ అసలు ఫిర్యాదుదారుడ్నే బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తే బయటపడిపోవచ్చని అనుకున్నాడు. కానీ అక్కడే ఓ సారి తర్వాత జరిగేదో ఆలోచిస్తే.. అడుగు ముందుకు వేసేవాడు కాదు.
ఫిర్యాదుదారును బెదిరించడం తీవ్ర నేరం
ఫిర్యాదుదారును బెదిరించడం తీవ్ర నేరం అవుతుంది. ఓ సారి కేసు నమోదు చేసిన తర్వాత తాను కేసు వెనక్కి తీసుకుంటానని ఎవరైనా వెళ్తే దాని వెనుక ఎలాంటి పరిణామాలు జరిగి ఉంటాయో ఖచ్చితంగా ఆరా తీసే వ్యవస్థ ఉంటుంది. సత్యవర్థన్ అనే టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ .. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు చేశారు. అతనితో ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేస్తే పని అయిపోతుందని అనుకున్నారు. అతనిని కిడ్నాప్ చేసి.. వీడియో రికార్డు చేయించి.. కోర్టుకు కూడా వారే స్వయంగా కారులో తీసుకెళ్లి.. లాయర్లను పెట్టి వాంగ్మూలం ఇప్పించారు.
కానీ పోలీసులు అంత చేతకాని వాళ్లా ?
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి దృశ్యాలు ఎదురుగా ఉన్నాయి. ఓ ఫిర్యాదుదారు వెనక్కి తగ్గినంత మాత్రాన కేసు కొట్టేయరు. అతను ఎందుకు ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాడో పోలీసులు విచారిస్తారు. అక్కడే అసలు విషయం బయటపడింది. సత్యవర్థన్ ను ఐదుగురు కిడ్నాప్ చేసి బెదిరించి ఈ నాటకం ఆడించారు. సులువుగానే దొరికిపోయారు. ఇప్పటి వరకూ ఇతర కేసుల్లో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయపరమైన వెసులుబాటు లభించింది కానీ నేరుగా ఫిర్యాదుదారుడ్నే బెదిరిస్తే ఊరుకుంటారా ?.
ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తోంది కదా .. తాము చట్టవిరుద్ధంగా వెళ్తామనుకుంటే కష్టమే!
ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది కదా.. తాము చట్టవిరుద్ధంగా వెళ్లి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఇరుకున పెట్టవచ్చని అనుకుంటున్నారేమో కానీ మొత్తానికి నేరుగా వచ్చి గుంతలో దూకినట్లయింది. ఇప్పుడు వంశీకి బెయిల్ రావడం కూడా అంత తేలిక కాదు. పోలీసుల్ని.. న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదుదారుల్ని బెదిరిస్తే ఏ వ్యవస్థ కూడా క్షమించదు.