వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే.. కార్యకర్తలు రోడ్లపైకి వస్తారేమో అని పోలీసులు 144 సెక్షన్ విధించారు. తీరా పోలీస్ స్టేషన్ వద్దకు కూడా పది మంది కార్యకర్తలు రాలేదు. మీడియా ప్రతినిధులతో పాటు వంశీ కోసం వచ్చిన ఇద్దరు, ముగ్గురు లాయర్లే కనిపించారు. వంశీ ఓడిపోయిన తరవాత గన్నవరంలో కనిపించడం మానేశారు. అదే సమయంలో ఆయనపై గన్నవరం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన చేసిన అక్రమాలకు తోడు.. ఆయన కంటూ క్యాడర్ లేకుండా పోయింది.
కొంత మంది రౌడీ మూకల్ని పోగేసుకుని వారే క్యాడర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చినందున ఆయనకు టీడీపీ క్యాడర్ దూరమయింది. వైసీపీలో ముందు నుంచి ఉన్న వారు ఆయనకు సపోర్టుగా లేరు. అదే సమయంలో ఆయన రౌడీ అనుచరగణం తమపై పోలీసుల దృష్టి ఎక్కడ పడుతుందోనని కనిపించకుండా పరారయ్యారు. దీంతో వంశీ కోసం ఎవరూ రాలేదు. ఆయన అరెస్టు గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినా పెద్దగా పట్టించుకున్న వారు లేరు.
మరో వైపు వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి … కక్ష సాధింపు అరెస్టు అని చెప్పారు కానీ.. గతంలో ఆయన చేసినవి గుర్తుకు వస్తే ప్రజలు కూడా అసహ్యించుకుంటారని చాలా పైపైన మాట్లాడి మ..మ అనిపించారు. వంశీ విషయంలో వైసీపీ లాయర్లను కూడా ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ప్రతీ దానికి పోలోమంటూ వచ్చే నిరంజన్ రెడ్డిని ఈ సారి వంశీ కోసం పిలించడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.