వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీకి సేవలందించే విషయంలో వీళ్లలో వీళ్లు గొడవలు పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి! తాము ఎక్కువ సేవ చేస్తున్నాం.. మేము నిస్వార్థంగా జగన్ కోసం పోస్టులు పెడుతున్నాం , పార్టీ ఐటీ వింగ్ లోఉన్న వారు మాత్రం ఎలాంటి పనీ చేయడం లేదు… అనేది కొంతమంది గట్టిగా వినిపిస్తున్న ఆరోపణ. పార్టీ లో పదవులు అనుభవిస్తూ.. అందుకు గానూ జీతం పేరు ప్రఖ్యాతులను పొందుతున్న వారు ఎలాంటి పోస్టులూ పెట్టడం లేదని, తమకు మాత్రం అలాంటి సౌకర్యాలూ లేకపోయినా కష్టపడుతున్నామని కొంతమంది చెబుతున్నారు.
మరి వీరు గుర్తింపును కోరుకొంటున్నారో, లేక ఏవైనా పదవులు కోరుకొంటున్నారో, జీతభత్యాలను కోరుకొంటున్నారో మాత్రం పైకి క్లారిటీ ఇవ్వడం లేదు. వైకాపా ఐటీ వింగ్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ పోస్టింగుల ప్రక్రియకు దూరంగా ఉంటున్నారట!
వీరు దూరంగా ఉన్నారని.. వేరే వాళ్లు పోస్టులు మొదలుపెట్టారు. నిస్వార్థం గా పని చేసిన వారు పోస్టింగులకు దూరంగా ఉంటున్నారని.. దీని కారణం పార్టీలోని కొంతమంది అంటూ వీళ్లు మొదలుపెట్టారు. మరి నిస్వార్థంగా పనిచేస్తూ ఉండి ఉంటే అసలు సమస్య ఎలా వస్తుంది? పార్టీ ఐటీ వింగ్ వారి పై వీరి నిరసన ఇలా రచ్చకు ఎక్కించడం మాత్రం కచ్చితంగా జగన్ పార్టీకి నష్టం కలిగించేదే! పార్టీ తీరుపై నిజంగానే నిరసన భావం ఉంటే సైలెంట్ అయిపోవచ్చు. అంతే కానీ.. నిస్వార్థంగా పనిచేశాం.. మమ్మల్ని గుర్తించడం లేదు, పార్టీ తీరు సరిగా లేదు అంటూ.. లొల్లి పెట్టడం మాత్రం నిజమైన స్వార్థం అనిపించుకుటుంది. మొత్తానికి ప్రతిపక్షంలో కూలబడిన జగన్ పార్టీ వాళ్లు ఇలా రచ్చ చేసుకోవడం ఏమిటో!