Laila Movie Review
తెలుగు360 రేటింగ్: 0.5/5
హీరోలు ఆడవేషం వేశారంటే, అది కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారంటే… అనుకోకుండా ఆ సినిమాపై ఫోకస్ పెరిగిపోతుంది. చిత్రం భళారే విచిత్రం, మేడమ్, భామనే సత్యభామనే… తదితర సినిమాల్లో హీరోలు లేడీ గెటప్పుల్లో నవ్వించారు. ఇప్పటికీ ఆ సినిమాలు చూసి మళ్లీ మళ్లీ నవ్వుకొంటున్నారు అభిమానులు. ఆయా చిత్రాలు పంచిన వినోదం అలాంటిది. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా `లైలా`గా కనిపిస్తాడు అనగానే అందరూ అదే అనుకొన్నారు. మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ చీర కట్టులో ఎలా ఉంటాడో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తాడో, ఎంతటి వినోదం అందిస్తాడో అని అంతా ఎదురు చూశారు. విడుదలకు ముందు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకొన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో `ఫృథ్వీ` ఇచ్చిన పంచ్‌తో ఆ పబ్లిసిటీ ఇంకాస్త పెరిగింది. ‘బాయ్ కాట్ లైలా’ నినాదం సోషల్ మీడియాలో మార్మోగింది. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన లైలా ఎలా వుంది? విశ్వక్ లేడీ గెటప్పుకూ, ఆ సెటప్పుకూ ఎన్ని మార్కులు పడ్డాయి.
సోనూ మోడల్ (విశ్వక్సేన్) ఓ బ్యూటీషియన్. పాత బస్తీలో ఓ పార్లర్ నడుపుతుంటాడు. అమ్మాయిలంతా సోనూతో మేకప్ వేయించుకోవాలని, అందంగా మెరిసిపోవాలని ఆశ పడుతుంటారు. పార్లర్‌కి వచ్చినవాళ్లందర్నీ ‘అక్కా. అక్కా’ అని ప్రేమతో పిలుస్తుంటాడు సోనూ. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొంటుంటాడు. అలా ఓ అక్క కష్టానికి చెలించిపోయిన సోనూ.. ఆర్థిక సహాయం చేసి, ఆదుకొంటాడు. ఆ అక్క వల్లే… కల్తీ నూనెల స్కామ్ లో ఇరుక్కొంటాడు. కల్తీ నూనెతో చేసిన విందు వల్ల… చాలామంది ఆసుపత్రి పాలు అవుతారు. అందులో ఎం.ఎల్.ఏ కూడా ఉంటాడు. వాళ్ల బారీ నుంచి తప్పించుకోవడానికి సోనూ లైలాగా మారాల్సివస్తుంది. ఆ తరవాత ఏమైంది? సోనూగా చేయలేని పనిని, లైలాగా చేయగలిగాడా, లేదా? అనేది మిగిలిన కథ.
హీరో ఆడవేషం వేయాలంటే బలమైన కారణాలు ఉండాలి. పైన చెప్పుకొన్న చిత్రం భళారే, భామనే సత్యభామనే, మేడమ్లలో అది కనిపిస్తుంది. తనపై పడ్డ నిందను చెరిపేసుకోవడానికి, ఎం.ఎల్.ఏ మనుషుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి హీరో ఇక్కడ ఆడవేషం వేయాల్సివచ్చింది. సోనూ లైలాగా మారడానికి ఈ సెటప్ సరిపోలేదు. ఎందుకంటే… సోనూలో హీరోయిజం ప్రతీ సీన్లోనూ చూపించుకొంటూనే వచ్చారు. సోనూకి సాధ్యం కానిదంటూ ఏం లేదు. తను కొట్టి మరీ సాధించుకోగలడు. అలాంటివాడు… అందరికీ భయపడి లేడీ వేషం వేయడం తేలిపోయింది. పోనీ.. అంతకు ముందేమైనా అనుహ్యమైన సంగతులు జరిగాయా? వినోద భరితమైన సన్నివేశాలు చూపించారా? అంటే అది కూడా లేదు. ఒక్క సీన్లో కూడా దర్శకుడు క్రియేటీవ్‌గా ఆలోచించలేకపోయాడు. అన్నీ ముతక జోకులే. ‘మా ఫ్యామిలీ మొత్తం సోనూతోనే వేయించుకొంటాం..’ అని ఓ ఆంటీ అంటే.. ‘ఏం వేయించుకొంటారు?’ అని కమెడియన్ అనుమానంగా అడుగుతాడు. ‘మేకప్ లేరా..’ అని బదులిస్తాడు హీరో. ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు బోలెడన్ని ఉన్నాయి. కొన్నిసార్లు డైరెక్ట్ మీనింగే. పొరపాటున కుటుంబ సమేతంగా వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమిటి?
హీరోయిన్ హీరో ప్రేమలో పడిపోవడం మరీ విడ్డూరంగా ఉంటుంది. హీరో బ్యుటీషియన్ అయితే, హీరోయిన్ ఫిట్నెస్ సెంటర్ లో ట్రైనర్. గ్రౌండ్ చుట్టూ హీరోని ఐదు రౌండ్లు వేయమంటుంది ఆ అమ్మాయి. ‘అంత స్టామినా ఉందా’ అని గాలి తీసేస్తుంది కూడా. అప్పుడు హీరో.. తన స్టామినా చూపించుకోవడం కోసం హీరోయిన్ని తన భుజాలమీద ఎక్కించుకొని గ్రౌండ్ అంతా పరుగెడతారు. దించగానే.. హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. ‘ఈ వేడి తగ్గడానికి చన్నీళ్ల స్నానం చేయాలి’ అంటుంది. ఇదీ… దర్శకుడు రాసిన అమోఘమైన లవ్ సీన్.
ఇలాంటి జోనర్లో అక్కడక్కడ కాస్త అడల్ట్ కామెడీ వస్తూ పోతూ ఉండడం సహజం. కానీ అది హద్దుల్లో ఉండాలి. కానీ ఏ సీన్లోనూ దర్శకుడు ఆ హద్దులు గుర్తించలేకపోయాడు. హీరో – ఆడవేషం వేస్తే, ఆ బాడీ లాంగ్వేజ్ కాస్త గమ్మత్తుగా ఉంటుంది. అందులోంచే కావల్సినంత వినోదం పండుతుంది. కానీ.. ఇక్కడ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా డిజైన్ చేయలేదు. లేడీ గెటప్‌లో మారక.. హీరో తన కేస్ ని తానే సాల్వ్ చేసుకోగలిగాడా, తనపై పడిన నింద తానే చెరిపేసుకొన్నాడా? అంటే అదీ లేదు. మిగిలిన వాళ్లని బకరాలుగా మార్చడం తప్ప… లేడీ గెటప్‌ని ఉపయోగించుకోలేకపోవడం పెద్ద మైనస్. ఆడవేషం వేసుకొన్న హీరో దొరికేస్తాడా, లేదా? దొరికేస్తే ఎలాంటి సందర్భంలో దొరుకుతాడు? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలగాలి. అలాంటి సందర్భమే… ఈ సినిమా మొత్తంలో ఎదురు కాలేదు. సీన్లు.. ఆ స్థాయిలో రాసుకొన్నాడు దర్శకుడు. మధ్యలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశీత్ కామెడీ ఒకటి. తను ఇంటర్వ్యూల్లోనే ఇంతకంటే బాగా నవ్వించాడు. క్లైమాక్స్‌లో కోర్ట్ కామెడీ వరకూ వచ్చేసరికి ప్రేక్షకుల్లో అప్పటికే బోలెడంత నిస్సత్తువ, నీరసం ఆవహించేస్తాయి.
విశ్వక్ మాస్‌కి నచ్చేట్టు కనిపించగలడు. మాస్ ని మెప్పించే స్టామినా తనకుంది. అయితే.. సరైన పాత్రలు పట్టుకోవాలి. ‘లేడీ గెటప్పులో కనిపిస్తే చాలు’ అనుకొని ఈ సినిమా ఒప్పుకొన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన పాత్ర సైతం అంత బలంగా, ఉత్సాహవంతంగా అనిపించదు. లేడీ గెటప్పయితే వేశాడు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోలేకపోయాడు. హీరోయిన్ కేవలం గ్లామర్ డాళ్‌గానే కనిపించింది. అభిమన్యుసింగ్ ఉన్నంతలో కాస్త బెటర్. తన అమాయకత్వంతో కూడిన విలనిజం అక్కడక్కడా కాస్త నవ్విస్తుంది. ‘బాయ్ కాట్ లైలా’ ఉద్యమానికి ప్రధాన కారణమైన ఫృథ్వీ ఈ సినిమాలో ఎందుకూ కొరగాని ఓ పాత్ర చేశాడు. లైలాతో ఓ ఫైట్ చేయించడానికి మినహా ఆ పాత్ర ఎందుకూ ఉపయోగపడలేదు.
లియోన్ జేమ్స్ అందించిన పాటల్లో ఒక్కటి కూడా గుర్తుంచుకొనే విధంగా లేదు. `కోయ్ కోయ్.. కోడ్‌ని కోయ్` అంటూ ఈమధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ పాటని మాత్రం తెలివిగా వాడుకొన్నారంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, క్వాలిటీ అన్నీ యావరేజ్ స్థాయిలోనే ఉన్నాయి. కథగా ఈ సినిమాలో మెస్మరైజ్ కలిగించే విషయాల్లేవు. సన్నివేశాల్లో బలం లేదు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశాడన్న పాయింట్ తప్ప, థియేటర్లకు రప్పించే మరో అంశం లేదు. అయితే దురదృష్టవశాత్తూ… ఆ లేడీ గెటప్పే తేలిపోయింది. ‘మన సినిమాల్లో హీరోలు ఆడవేషం వేసి 20 ఏళ్లయ్యింది’ అని లెక్కలు తీశాడు విశ్వక్సేన్. ఇలాంటి సినిమాలొస్తే.. మరో హీరో లేడీ గెటప్ వేసే ధైర్యం చేయడానికి మరో అరవై ఏళ్లయినా పడుతుందేమో?!
తెలుగు360 రేటింగ్: 0.5/5