రియల్ లైఫ్ తండ్రీ కొడుకులు బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాత-మనవళ్లుగా నటించడం, మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘మసూద’ లాంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన రాహుల్ యాదవ్ నిర్మించిన సినిమా కావడం, చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం.. ఇవన్నీ ‘బ్రహ్మా ఆనందం’ పై దృష్టిపడేలా చేశాయి. ప్రచార చిత్రాల్లో ఓ ఫీల్ గుడ్ డ్రామా కనిపించింది. మరి ట్రైలర్ లో కనిపించిన ఆ ఫీల్ గుడ్ డ్రామా సినిమాలో ఉందా? ఇంతకీ ‘బ్రహ్మా ఆనందం’ కథ ఏమిటి?
బ్రహ్మ (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. సినిమా నటుడు కావాలనేది అతని కల. అవకాశాల వేటలో ఉంటాడు. రంగస్థలంలో సరైన పాత్రలు దొరకవు. దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే ఛాన్స్ వస్తుంది. అయితే ఆ ప్రదర్శనకు రూ.6 లక్షలు కావాలి. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు వర్క్ అవుట్ కావు. సరిగ్గా అదే సమయంలో వృద్ధాశ్రమంలో ఉండే తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) బ్రహ్మ జీవితంలోకి వస్తాడు. కోదాడ దగ్గర ఆరెకరాల భూమి తన పేరు మీద ఉందని, తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని చెప్పి బ్రహ్మను ఊరుకి తీసుకెళ్తాడు ఆనంద రామ్మూర్తి. తర్వాత ఏం జరిగింది ? అసలు ఆనంద రామ్మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకు వున్నాడు ? ఈ కథలో జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి) ఎవరు? చివరికి బ్రహ్మ కల నెరవేరిందా? ఇదంతా తెరపై చూడాలి.
ఒక కథతో ఒకే విషయాన్ని చెప్పాలనే రూల్ లేదు. ఒక కథతో ఎన్ని విషయాలైన చెప్పొచ్చు. కానీ ఎత్తుకున్న పాయింట్ ని ఆడియన్ కి చేరవేయడంలో కమ్యునికేషన్ గ్యాప్ వుండకూడదు. బ్రహ్మా ఆనందం కథలో కూడా చాలా విషయాలు వున్నాయి. కానీ సమస్య ఏమిటంటే.. కమ్యునికేషన్ గ్యాప్. ఈ కథలో మొత్తం కీలకంగా మూడు పాత్రలు కనిపిస్తాయి. బ్రహ్మ (రాజా గౌతమ్) ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం), జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి). ఈ ముగ్గురికి మూడు కథలు వున్నాయి. మూడు విభిన్నమైన ప్రయాణాలు వున్నాయి. కానీ ఒక్క ప్రయణం కూడా ప్రేక్షకుడి మనసుని హత్తుకునేలా వుండదు. ఒక్క పాత్రతో కూడా ఆడియన్ ఎంపతైజ్ కాలేడు.
బ్రహ్మ పాత్ర చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లుకుంటూ కథని మొదలుపెడతారు. రీళ్ళు గడిచిపొతుంటాయి కానీ ఆ సీన్లు ఎందుకు? ఎవరి కోసం చూపిస్తున్నారు ?వాటితో ఎలాంటి డ్రామా చూపించబోతున్నారనే క్లూ వుండదు. తీసేవాడికి చూసే వాడు లోకువ అన్నట్టుగా నింపాదిగా నిదానంగా అలా సాగదీసుకొని సహనానికి పరీక్షపెడతారు. చాలా సన్నివేశాలు తర్వాత టైటిల్ పడుతుంది. అది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బావున్నాననే ఫీలింగ్ ఆడియన్ లో వస్తుందంటే కథనంలో చురుకుదనం ఏపాటిదో ఊహించవచ్చు.
ఎంతమాత్రం సర్ ప్రైజ్ చేయని ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత కూడా అదే నింపాది ట్రీట్మెంట్ లో విసిగిస్తుందీ సినిమా. ఈ కథ, తీసిన విధానంలో చాలా లోపాలు కనిపిస్తాయి. సినిమాకి వుండే పేస్ ఇందులో కనిపించదు. డైలాగులు నాన్ సింక్ లో పడుతుంటాయి. ప్రీక్లైమాక్స్ వరకూ దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ ఏమిటో అంతుచిక్కదు. మలి వయసులో ప్రేమ, పెళ్లి గురించి చెప్పదలచుకుంటే దానికి ట్రీట్మెంట్ మాత్రం ఇది కాదు. అదే పాయింట్ అనుకుంటే ఈ సినిమా ఫస్ట్ అంతా ఎడిటింగ్ లో లేపేసినా ఎలాంటి మార్పు వుండదు. పోనీ.. ఎవరి తోడు లేకుండా పెరిగిన ఓ కుర్రాడి కథ అనుకున్నా ఇందులో డ్రామా దానికి న్యాయం చేయదు.
బ్రహ్మానందం నటన గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వెటరన్. ఆ పాత్ర ఆయనకి కొట్టిన పిండి. అయితే ఆయనలో కామెడీ టింజ్ తగ్గుముఖం పట్టింది. రాజా గౌతమ్ డీసెంట్ గా చేశాడు. అయితే ఆయన పాత్రని రాసుకున్న విధానంలో లోపం వుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ పాత్ర క్లూ లెస్ గా వుంటుంది. వెన్నెల కిషోర్ సినిమా అంతా కనిపిస్తాడు కానీ నవ్వులు మాత్రం అక్కడక్కడే. ప్రియా వడ్లమాని లవ్ ట్రాక్ కాస్త వింతగా వుంటుంది. తాళ్లూరి రామేశ్వరి హుందాగా కనిపించింది. రాజీవ్ కనకాల, మిర్చి సంపత్ పాత్రలు రాయడంలో చాలా లోపాలు వున్నాయి.
సినిమా చాలా పరిమిత బడ్జెట్ లో తీశారని అర్ధమౌతుంటుంది. ఓ ఐదుగురి డేట్స్ తీసుకొని ఓ నాటకంలా వాళ్ళ చుట్టూనే సన్నివేశాలు చుట్టేశారు. దర్శకుడు నిఖిల్ చాలా పరిణితి వున్న ఓ కథని చూపించాలనే ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం జనరంజకంగా లేదు. మంచి అభిరుచి వున్న రాహుల్ లాంటి నిర్మాత నుంచి ఇలాంటి బలహీనమైన కంటెంట్ రావడం గమనార్హం. ఇప్పటికిప్పుడు థియేటర్స్ లో చూసే కంటెంట్ కాదిది. ఓటీటీలో చూడాలన్నా చాలా ఓపిక కావాలి.