లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అత్యంత భారీ విజయమే ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారినట్టుంది. మోడీ మానియాతో, బీజేపీ పటిష్ట కార్యాచరణతో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక మిత్రపక్ష పార్టీతో కలుపుకుని ఏకంగా 90 శాతం సీట్లలో బీజేపీ జయకేతనం ఎగరేసింది. మరి ఆ ఎన్నికలు పూర్తి అయ్యి రెండు సంవత్సరాలు గడిచాయి. మరో ఏడాదిలో యూపీకి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద సమస్య గా మారింది.
ఒకవేళ యూపీలో గనుక ఇప్పుడు రెండేళ్ల కిందటి నాటి స్థాయి విజయాన్ని నమోదు చేయకపోతే బీజేపీ పై చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీది కేవలం పాలపొంగు విజయమే అని ప్రతిపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల సమయంలో సాలిడ్ గా బీజేపీకి మద్దతుగా నిలిచిన యూపీ ఓటర్లు ఇప్పుడు అలాంటి తీర్పును ఇవ్వలేదంటే.. బీజేపీ నమ్మకం పోయినట్టే అనే విశ్లేషణలు వినిపించడం ఖాయం. ఇలాంటి విమర్శలు రాకూడదనుకొంటే.. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి. 400 అసెంబ్లీ సీట్లున్న యూపీలో 90 శాతం సీట్లను కాకపోయినా.. కనీసం అధికారానికి అవసరమైన సీట్లను అయినా సాధించాలి!
అయితే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న యూపీలో ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభం కాదు! లోక్ సభ ఎన్నికల తీరు వేరు, అసెంబ్లీ ఎన్నికల లెక్కలు వేరు! అయితే విమర్శించే వాళ్లు ఇలాంటి లెక్కలన్నీ వేయరు. విమర్శించేస్తారంతే. ఇలాంటి నేపథ్యంలో యూపీలో ఎలాగైనా ఉనికిని చాటడానికి బీజేపీ అష్టకష్టాలూ పడుతోంది. ఆఖరికి కేవలం రెండు ఎంపీల బలం ఉన్న ఒక కులం పార్టీ కి కూడా పెద్ద పీట వేసింది. ఆ ఇద్దరు ఎంపీలున్న పార్టీలో ఒకరికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు మోడీ. అంతే కాదు.. యూపీలోని చోటామోటా ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడానికి కూడా బీజేపీ చాలా కష్టాలే పడుతోంది. వారి డిమాండ్లకు అనుగుణంగా నడుచుకొంటోంది. ఒకవేళ బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో యూపీలో అన్ని సీట్లురాకపోయింటే ఇప్పుడింత టెన్షన్ ఉండేది కాదు. ఒక్కోసారి విజయం కూడా ఒత్తిడిని పెంచుతుంది అంటే అది ఇలాగేనేమో!