వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీలో వస్తున్న స్పందనలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు బయటకు వచ్చి ఇది అన్యాయం అని మైకుల ముందు అరిచి ఇంటికెళ్లిపోయి ప్రశాంతంగా ఉంటున్నారు. వైసీపీ క్యాడర్ అయితే బాగా జరిగింది అనుకుంటోంది. ఎవరూ ఓ నిరసన చేయలేదు. కొంత మంది నేతలు బయటపడి.. ఇలాంటి వాళ్లను అసలు పార్టీ నుంచి బహిష్కరించాలని అంటున్నారు. వాసుపల్లి గణేష్ నేరుగా మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, వల్లభనేనిని గెంటేయాలని వాసుపల్లి సూచన
వైసీపీకి ఈ నోటి దురుసు నేతలు చేసినంత నష్టం ఇంకెవరూ చేసి ఉండరన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. వాసుపల్లి గణేష్ కూడా చెబుతున్నాయి. వీరి వల్ల వైసీపీకి ఒక్క ఓటు లాభం లేదు కానీ.. తీవ్రమైన డ్యామేజ్ జరగడానికి కారణం అయ్యారని ఆరోపిస్తున్నారు. వారిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. పార్టీతో సంబందం లేదని చెబితేనే సామాన్యుల్లో పార్టీకి కాస్తంత సానుకూలత ఉంటుందని అంటున్నారు. వారిద్దరూ చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఘోరమైన మాటలు మాట్లాడటం వల్లే వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని వైసీపీ భావన.
రోజాను మాట్లాడకుండా చేయాలన్న వాసుపల్లి
వంశీ, నానితో వైసీపీకి ఎంత నష్టం జరిగిందో.. రోజా వల్ల కూడా అంతే నష్టం జరిగిందని వాసుపల్లి భావన. రోజాను పార్టీ నుంచి బయటకు పంపేయకపోయినా ఆమెను వీలైనంత వరకూ మాట్లాడకుండా చేయాలన్న అభిప్రాయాన్ని వాసుపల్లి వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అయి ఉండి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అసహ్యాన్ని పెంచేలా ఉంటాయని అంటున్నారు. వాసుపల్లి గణేష్ నేరుగా మీడియాను పిలిచి మరీ ఇలా చెప్పడం అనూహ్యమే.
సామాన్య వైసీపీ కార్యకర్తల భావన కూడా అదే !
అధికార పార్టీగా ఉన్నప్పుడు వైసీపీ బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి.. బూతుల పార్టీగా మారిపోయింది. తమను ఎవరూ ఏమీ అనలేరని..తాము మాత్రం బూతులు తిట్టవచ్చని రెచ్చిపోయారు. కానీ ఓట్లు వేసే సామాన్య ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించలేదు. ఎంతో మంది క్యాడర్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినా మారలేదు. జగన్ కు ఇష్టం కాబట్టి ఇలా మాట్లాడుతున్నామని.. అలా మాట్లాడితేనే పదవులు వస్తాయని అనుకున్నారు. ఇప్పటికీ వారు తెలుసుకున్నట్లుగా లేదన్న భావన తాజా పరిణామాలతో వస్తోంది.