సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడడంతో… చిరంజీవి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొత్త కథలు వినడం, వాటిని ఓకే చేయడం, కొన్ని సినిమా ఫంక్షన్లకు హాజరవ్వడం మినహా పెద్ద పనులేం పెట్టుకోలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ షూటింగ్ మోడ్‌లో పడిపోయారు. ‘విశ్వంభర’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు బాకీ ఉన్నాయి. ప్రస్తుతం ఒక పాటని తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరులోగా మరో పాట పూర్తవుతుంది. దాంతో ‘విశ్వంభర’కు సంబంధించిన షూటింగ్ అయిపోయినట్టే.
మరోవైపు అనిల్ రావిపూడితో కథా చర్చల్లో కూర్చుంటున్నారు మెగాస్టార్. ఇటీవలే.. అనిల్ రావిపూడి పూర్తి కథ వినిపించేశారు. దానికి సంబంధించిన ఫైనల్ టచింగులు ఇస్తున్నారు చిరు. అవి పూర్తయితే, అనిల్ రావిపూడి స్క్రిప్టు రైటింగ్ మొదలెట్టేస్తారు. అనిల్ రావిపూడితో పాటుగా మరో ప్రాజెక్టు సమాంతరంగా మొదలెట్టాలని చూస్తున్నారు చిరు. ఒకరిద్దరు దర్శకుల కథలు విని ఫైనల్ కూడా చేశారు. అయితే… నిర్ణయం మాత్రం పెండింగ్ లో ఉంది. ఇంకొన్ని కథలు వినాలా? లేదంటే విన్న కథల్లోనే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా? అనే మీమాంశలో ఉన్నారు చిరు. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సివుంది. సినిమా అంతా పూర్తయ్యింది కాబట్టి సోలో రిలీజ్ డేట్ చూసుకొని వదలాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి యూవీ నిర్మాతలతో కూడా చిరు మాట్లాడుతున్నారు.