ఈమధ్య కాలంలో ఓ సినిమా సాధించిన ఘోరమైన రేటింగులు `లైలా` విషయంలోనే చూశారు జనాలు. ఒకటి కాదు, రెండు కాదు… సోషల్ మీడియాలోని సైట్లన్నీ ఒకటి, అరా రేటింగులు ఇచ్చాయి ఈ సినిమాకు. `అది కూడా ఎక్కువే` అన్నది సినిమా చూసినవాళ్ల మాట అనుకోండి.. అది వేరే విషయం.
ఓ సినిమా ఎలా తీయకూడదో చెప్పడానికి లైలాని ఉదాహరణగా చూపిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే… మరింత దారుణంగా ఉన్నాయి. ఆఖరికి విశ్వక్సేన్ ఫ్యాన్స్ కూడా ‘ఇలాంటి సినిమాలు తీస్తున్నావేంటన్నా’ అంటూ తెగ ఫీలైపోతున్నారు. లేడీ గెటప్ సినిమాలంటే ఇది వరకు ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మేడమ్’, ‘భామనే సత్యభామనే’ చిత్రాలు గుర్తొచ్చేవి. కాసేపు ఆ సినిమాల్ని తలచుకొని, నవ్వుకొనేవాళ్లు ఆడియన్స్. ఇప్పటికీ ఈ సినిమాని రిపీట్ మోడ్‌లో చూసేవాళ్లు ఉన్నారు. టీవీలో వస్తే.. సినిమా పూర్తయ్యేంత వరకూ వదలరు. అలా లేడీ గెటప్పుల జోనర్‌కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. అయితే ఇప్పుడు వాళ్లంతా ‘లైలా’ని చూసి భయపడే స్థాయికి వచ్చేశారు. ఇదంతా దర్శకుడు, రచయిత చేసిన తప్పుల వల్లే.
హీరోలు గెటప్పులు వేస్తే సినిమాలు హిట్టయిపోతాయన్న భ్రమల్లో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లు బయటకు రావాల్సిందే. నాలుగు ముతక జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు, హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఫోజుల వల్ల సినిమాలు ఆడవు. సినిమా విడుదలకు ముందు ఎంత పబ్లిసిటీ చేసినా, ‘మేం పొడిచేశాం.. చించేశాం.. చాలా కష్టపడ్డాం’ అని పోజులు కొట్టినా, అంతిమంగా రిజల్ట్ ముఖ్యం. సినిమా చాలా మారుతోంది. చూసే విధానం, తీసే పద్ధతి చాలా మారాయి. చీప్ ట్రిక్స్ కి ప్రేక్షకులు పడిపోవడం లేదు. ఓ సినిమా హిట్టయ్యిందంటే అందులో ఎంతో కొంత నిజాయితీ, కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించే ఉంటారు. అవేం లేకపోతే.. వెండి తెరపై ఎన్ని వేషాలు వేసినా ప్రతిఫలం శూన్యం. ఈ విషయాన్ని కొత్త దర్శకులు, యువ హీరోలు గుర్తు పెట్టుకోవడం మంచిది.