హైదరాబాద్లో అద్దె ఇళ్లకు గత ఏడాదిన్నరగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. అద్దెలను కనీసం నలభై శాతం వరకూ పెరిగాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల అయితే డబుల్ బెడ్ రూం ఇల్లు ఎక్కడైనా కనీసం పదిహేను నుంచి ఇరవై వేల వరకూ చెబుతున్నారు. ఇక ఐటీ కారిడార్ కు దగ్గర ప్రాంతాల్లో అయితే స్టార్టింగే నలభై వేల వరకూ ఉంటున్నాయి. ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందోనని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఎన్నికలకు ముందు నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ అయింది. అమ్మకాలు తగ్గాయి. ఎక్కువ మంది అద్దెకు ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా తర్వాత ఉపాధి కోసం సిటీకి వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ కారణంగా అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగిపోయిందని అంచనా వేస్తున్నారు. శివారు ప్రాంతాలు ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందడానికి శరవేగంగా కాలనీలు విస్తరించడానికి అదే కారణం అని అంచనా వేస్తున్నాయి.
అద్దె ఇళ్ల మార్కెట్ లోనూ ఇప్పుడు కరెక్షన్ రావాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందటి వరకూ బెంగళూరులో అద్దె ఇళ్లు అంటే చాలా మంది అమ్మో అనేవారు. అక్కడి అద్దెలను భరించడం అంత తేలిక కాదని అనుకునేవారు. ఇప్పుడు బెంగళూరులో అద్దెలపై పెద్దగా చర్చ జరగడం లేదు.కానీ హైదరాబాద్ లో ఆ చేర్చ ప్రారంభమయింది.