ఒక తప్పు చేద్దామంటే.. మూడు తప్పులు చేద్దామనే ఐపీఎస్,ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనీ ఐపీఎస్‌లే యూనిపాంతో దందాలు చేస్తున్నారని .. విలువలు అంతగా దిగజారిపోయాయని ఆయన గోపాలకృష్ణ నాయుడు అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులను క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాలని సూచించినా వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలనలో రేవంత్ రెడ్డి కోరుకున్న వేగాన్ని వారు అందివ్వలేకపోతున్నారు. ఈ అసంతృప్తి ఆయనలో కనిపించింది.
రాజకీయానికి లొంగిపోయిన సివిల్ సర్వీస్ అధికారులు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలనలో అధికారులు చురుకుగా కదలకపోవడం దగ్గర నుంచి.. తప్పు దారి పట్టిన వారి వ్యవహారంపై అన్ని నివేదికలు ఆయనకు వస్తాయి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. కాస్త లోతుగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ ఇరవై ఏళ్ల కిందట ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల పనితీరును చూసి.. ఇప్పుడు ఆ అధికారుల తీరు చూస్తే..ఎంతగా రాజకీయ కలుషితం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో రాజకీయ నేతలు ఇంత ఘోరంగా సివిల్ సర్వీస్ వ్యవస్థను ఉపయోగించుకోలేదు. కానీ ఉపయోగించుకునే అవకాశాన్ని వారు ఇచ్చేశారు.
అధికారులు శాశ్వతం..రాజకీయ నేతలు తాత్కాలికం అయినా లొంగిపోయిన వ్యవస్థ
రాజకీయ నేతలు ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాలి. కానీ సివిల్ సర్వీస్ అధికారులు మాత్రం ఒక్క సారి సర్వీస్ లోకి వస్తే రిటైరయ్యే వరకూ ఉంటారు. వారిని సర్వీస్ నుంచి తొలగించాలంటే వారంతటకు వారు కోరుకోవాలి. రాజకీయ నేతల వల్ల వారి సర్వీస్ ఎప్పటికీ పోదు. కానీ వారు తమకు ఉన్న అధికారాన్ని .. వ్యవస్థ , రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని రాజకీయానికి తాకట్టు పెట్టేశారు. తెలంగాణలో పదేళ్ల కాలంలో కొంత మంది అధికారులే మొత్తం చక్రం తిప్పారు. ఫోన్ ట్యాపింగ్ సహా ఎన్నో ఆరోపణలు ఆయా అధికారులపై వచ్చాయి. సీఎస్ గా పనిచేసిన సోమేష్ వ్యవహారాలపై ఆశ్చర్యపోని వారు ఉండరు. ఇక ఏపీలో వైసీపీ హయాంలో అధికారులు వ్యవహరించిన తీరు వ్యవస్థకే పెద్ద మచ్చను తెచ్చి పెట్టాయి. మొత్తం సివిల్స్ సర్వీస్ వ్యవస్తను రాజకీయ అధికారం కాళ్ల ముందు పెట్టేశారు అధికారులు.
పడిపోయిన ప్రమాణాలను పెంచడం అంతా తేలిక కాదు !
నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రధాని చెప్పినా సరే అంగీకరించని అధికారుల గురించి ఆదర్శంగా చెప్పుకుంటాం. శంకరన్, శేషన్ , ఉమేష్ చంద్ర వంటి వారు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఎందుకంటే వారు తమ పవర్ ను .. ఎలా ఎందుకు ఉపయోగించులో అందుకు ఉపయోగించారు. ప్రజల పక్షాల నిలబడ్డారు. ఈనాటి అధికారులు ఫలానా అధికారి చాలా సిన్సియర్ అని చెప్పుకోలేరు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆవేదన అదే. సివిల్స్ సర్వీస్ వ్యవస్థ బాగా పని చేస్తే అద్భుతాలు చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. కానీ దానికి తగ్గ సహకారం లేక ఇలా సందర్భాన్ని బట్టి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇందులో ఒక్క శాతం కూడా అవాస్తవం లేదు.